అమ‌రావ‌తిపై రోజువారీ విచార‌ణ‌.. ఇక‌, తేల్చేస్తారా?

Update: 2021-11-14 03:40 GMT
ఏపీలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన అంశం.. అమ‌రావ‌తి రాజ‌ధాని. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిల‌వాల‌న్న ఉద్దేశంతో.. గ‌త ప్ర‌భుత్వం ఇక్క‌డ రాజ‌ధాని ఏర్పాటు చేసింది. వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి.. ప్లాన్ లు కూడా రెడీ చేసింది. అయితే.. ప్ర‌భుత్వం మారిపోయింది. దీంతో బాధ్య‌తలు చేప‌ట్టిన‌.. వైసీపీ అధినేత జ‌గ‌న్.. రాజ‌ధానిపై రివ‌ర్స్ అయ్యారు. మూడు రాజ‌ధానుల జెండా ఎగ‌రేశారు. దీంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తే కావాలంటూ.. పెద్ద ఎత్తున ఇక్క‌డి రైతులు.. డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌పై.. హైకోర్టులో కేసులు కూడా ప‌డ్డాయి.

అయితే.. ఈ కేసులు ఎప్ప‌టిక‌ప్పుడు.. నాలుగ‌డుగులు వెన‌క్కి.. అన్న‌చందంగా సాగుతున్నాయి. హైకోర్టు లో న్యాయ‌మూర్తుల బ‌దిలీతో.. కేసుల విచార‌ణ వేగిరం కావ‌డం లేదు. వాస్త‌వానికి గ‌తంలో చీఫ్ జ‌డ్జిగా ఉన్న జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి.. దీనిని సీరియ‌స్‌గాతీసుకుని విచార‌ణ చేప‌ట్టారు. అయితే.. ఆయ‌న బ‌దిలీ అయ్యారు. ఆయ‌న బ‌దిలీ కూడా రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిన‌ట్టు అయింది. అంతేకాదు.. విచారణ సందర్భంగా అప్పటి చీఫ్ జస్టిస్ తో పాటు కొందరు జడ్జీలు చేసిన వ్యాఖ్యలు, వాటికి అనుగుణంగా ఇచ్చిన తీర్పులపై జగన్ అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి ఫిర్యాదు చేయటంతో దేశంలో సంచలనమైంది.

తర్వాత ప‌రిణామాల్లో జ‌స్టిస్‌ జేకే మహేశ్వరి వెంటనే బదిలీ అయిపోయారు. మహేశ్వరితో పాటు కొందరు జడ్జీలను కూడా సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న అరూప్ గోస్వామి ముందు కు రాజధాని కేసుల విచారణ వచ్చింది. అయితే... ఆయ‌న మ‌ళ్లీ మొద‌లు పెట్టామంటూ.. అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌ను ప‌క్క‌న పెట్టి.. ఆది నుంచి వినేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఇంత‌లో ఆయ‌న కూడా బ‌దిలీ అయ్యారు. దాంతో కొన్ని రోజుల కింద‌ట‌ బాధ్యతలు తీసుకున్న చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ ముందుకు విచారణ వచ్చింది.

చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనంలో జడ్జీలు ఎం సత్యనారాయణమూర్తి, డీవీఎస్ఎస్ సోమయాజులు సభ్యులుగా ఉన్నారు. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ మహేశ్వరితో పాటు జగన్ మరికొందరు జడ్జీలపైన కూడా ఫిర్యాదులు చేశారు. అలా జగన్ ఫిర్యాదులు చేసిన వారిలో సత్యనారాయణమూర్తి, సోమయాజులు కూడా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు.. తాజాగా  సోమ‌వారం నుంచి రాజ‌ధానిపై విచారణ ప్రారంభమవుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ విచారణను 15వ తేదీ నుంచి హైబ్రిడ్ పద్దతిలో హైకోర్టు ధర్మాసనం విచారణ మొదలుపెట్టబోతోంది.  

ఏం జ‌రుగుతుంది.?

ఇప్పుడు రోజువారీ విచార‌ణ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. కేంద్రం రాజ‌ధాని అంశం రాష్ట్రాల ప‌రిధిలోదేన‌ని.. పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంలో హైకోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేసే ప‌రిస్థితిలేదు. ఇక‌, రైతుల నిర‌స‌న‌లు, వారికి గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు.. ఇలా.. కొన్ని ఆర్థిక ప‌ర‌మైన అంశాలు ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వీటి విష‌యంలో హైకోర్టు చేసే ఆదేశాల మేర‌కు జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న మూడు రాజ‌ధానుల విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News