షా దెబ్బ‌కు తెలంగాణ కాంగ్రెస్ దిమ్మ తిరిగిపోయింది

Update: 2018-10-11 11:05 GMT
తెలంగాణ‌లో మాకు బ‌లం ఉంది. మా వ్యూహాలు మాకున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో మేం స‌త్తా చాటుతాం. ఊహించ‌ని రీతిలో విజ‌యం సాధిస్తాం.. లాంటి  చాలామాట‌ల్ని వినే ఉంటారు. కానీ.. ఇప్పుడిప్పుడే కమ‌ల‌నాథులు త‌మ వ్యూహాల్ని అమ‌లు చేయ‌టం షురూ చేసిన‌ట్లున్నారు. దీనికి సంబంధించిన తాజా ప‌రిణామం ఒక‌టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ లో భారీ క‌ల‌క‌లాన్ని రేపుతోంది.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉమ్మ‌డి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన దామోద‌ర రాజ‌న‌ర్సింహ గుర్తున్నారుగా?  ఆయ‌న స‌తీమ‌ణి బీజేపీలో చేరి సంచ‌ల‌నం సృష్టించారు. తాజా ప‌రిణామం దెబ్బ‌కు తెలంగాణ కాంగ్రెస్ కు మైండ్ బ్లాక్ అయ్యే ప‌రిస్థితి. భ‌ర్త అనుమ‌తితోనే ఆమె బీజేపీలో చేరారా?  లేదా? అన్న విష‌యంపై క్లారిటీ రావ‌టం లేదు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్ గానే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ లో కీల‌క నేతల్లో ఒక‌రుగా పేరున్న రాజ‌న‌ర్సింహ స‌తీమ‌ణి ప‌ద్మినీ రెడ్డి బీజేపీలో చేర‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ ఈ షాకింగ్ ప‌రిణామం ఎలా జ‌రిగింది?  ఎందుకు జ‌రిగింది? అన్న‌ది కాంగ్రెస్ నేత‌ల్లోనే కాదు.. తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఈ క‌థ వెనుక శ్రీ‌పీఠం వ్య‌వ‌స్థాప‌కులు ప‌రిపూర్ణానంద కీల‌క‌పాత్ర పోషించిన‌ట్లుగా చెబుతున్నారు.

షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రెండు రోజుల ముందు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి నుంచి ఫోన్ రావ‌టంతో హుటాహుటిన ఢిల్లీకి ప‌రిపూర్ణానంద వెళ్ల‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగానే దామోద‌ర స‌తీమ‌ణి పార్టీలో చేరిక గురించిన చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌రిపూర్ణ‌నంద‌కు మంచి శిష్యురాలిగా ప‌ద్మినీ రెడ్డికి పేరుంది. ప‌రిపూర్ణ‌నంద సూచ‌న‌తోనే ఆమె బీజేపీలో చేరిన‌ట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. ప‌రిపూర్ణ‌నంద‌కు ప‌లువురు రాజకీయ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న చెప్పాలేకానీ కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు పార్టీలో చేర‌తార‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన జాబితాను షాకు ప‌రిపూర్ణ‌నంద ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆ జాబితాలో ఉన్న వారిలో ప‌ద్మినీ రెడ్డి ఒక‌రిగా చెబుతున్నారు.  తాజాగా ఆమెకు సంగారెడ్డి బీజేపీ అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌ని చెబుతున్నారు. త‌న భ‌ర్త దామోద‌ర‌కు ఆంధోల్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో సంగారెడ్డి టికెట్ ను ఆశిస్తున్న దామోద‌ర స‌తీమ‌ణికి తాము ఇవ్వ‌లేమ‌న్న మాట‌ను పార్టీ చెప్ప‌టంతో గుర్రుగా ఉన్న ఆమె.. కాంగ్రెస్‌ కు షాకిచ్చేలా బీజేపీలో చేరిన‌ట్లు తెలుస్తోంది. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా..కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్ స‌తీమ‌ణి.. కాంగ్రెస్‌కు బ‌ద్ధ శ‌త్రువైన బీజేపీలో చేర‌టం కాంగ్రెస్ వ‌ర్గాల‌కు ఒక ప‌ట్టాన జీర్ణం కాని ప‌రిస్థితి నెల‌కొంది.  రానున్న రోజుల్లో ఇలాంటి షాకులు మ‌రిన్ని కాంగ్రెస్‌కు త‌ప్ప‌వంటున్నారు.

Tags:    

Similar News