దానం నాగేందర్ ను తరిమితరిమి కొట్టారు

Update: 2015-12-28 10:00 GMT
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ హవా రోజురోజుకూ తగ్గుతోంది. ఆయన్ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. తాజాగా సోమవారం జరిగిన ఘటనతో అది మరోసారి రుజువైంది. రెండుమూడుసార్లు టీఆరెస్ ఇంటి గడప వరకు వెళ్లి మరీ వెనక్కు తిరిగొచ్చిన ఆయన ఇప్పుడు పార్టీలో కష్టకాలం ఎదుర్కొంటున్నారు.  సోమవారం హైదరాబాద్ లోని ఉప్పల్‌ లో ఆ పార్టీ కార్యకర్తలే ఆయన్ను తరిమితరిమి కొట్టారు. ఆయనపై చేయిచేసుకున్నారని కూడా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ కు మాత్రమే దానం పరిమితమని పలువురు కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో హైదరాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కోడిగుడ్లు - టమాటాలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈక్రమంలో గ్రేటర్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ పై పలువురు దాడికి యత్నించారు. కార్యకర్తల మధ్య ఘర్షణతో పార్టీ ఆవిర్భావ వేడుకలు కాస్తా రసాభాసగా ముగిశాయి.

రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదలైన దానం హవా ఆ తరువాత కూడా బాగానే సాగింది. గత కొద్ది రోజులుగా ఆయనకు కష్ట కాలం మొదలైంది. గ్రేటర్ పరిధిలో ఉన్నప్పటికీ రంగారెడ్డి - మెదక్ జిల్లాల పరిధిలోని ప్రాంతాల్లో ఆయన జోక్యం చేసుకోరాదంటూ అక్కడి నేతలు చెబుతున్నారు. తాజాగా దానం ఉప్పల్ లో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు రాగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశ్ వర్గీయులు దానంను అక్కడి నుంచి తరమివేశారు. తొలుత పార్టీ కార్యాలయంలో మల్లేశ్ గౌడ్ పార్టీ జెండాను ఎగురేశారు. ఆ తరువాత అక్కడకు వచ్చిన దానం ఆ జెండాను మళ్లీ దించి తాను మళ్లీ ఎగరేశారు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన మల్లేశ్ గౌడ్ దానంపై చేయిచేసుకున్నారని సమాచారం. ఆ వెంటనే మల్లేశ్ అనుచరులు దానం వర్గీయులపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ హఠాత్పరిణామానికి కంగారుపడిన దానం, ఆయన టీం అక్కడి నుంచి పరుగులు తీశారని టాక్.
Tags:    

Similar News