భీమిలి మాజీ తరహాలోనే భీమవరం మాజీ.. వైసీపీకి గ్రంధి శ్రీను గుడ్ బై!
భీమవరం మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఘన విజయం సాధించి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పే గ్రంధి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు.
త్వరలో జనాల్లోకి వెళ్లబోతున్నట్లు, ప్రజల మధ్యనే ఉండబోతున్నట్లు, కార్యకర్తలను కలుపుకు పోబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటిస్తోన్న నేపథ్యంలో.. మరోపక్క నాయకులు పార్టీని విడిచి వెళ్తోన్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయగా.. తాజాగా గ్రంథి శ్రీను అదే దారిలో ముందుకు కదిలారు.
అవును... ఒకే రోజు గంటల వ్యవధిలో వైసీపీకి డబుల్ షాక్ తగిలిందని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... తన వ్యక్తిగత కారణాలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వల్ల భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో కోరారు.
మరోపక్క.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఘన విజయం సాధించి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పే గ్రంధి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ గ్రంధి శ్రీను రాజీనామాపై చర్చ జరుగుతున్నా.. ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గెలిచినా కూడా పార్టీలో సరైన గౌరవం ఇవ్వలేదనే ఒత్తిడి అభిమానుల నుంచి ఉందని.. ఇలా అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు వైసీపీకి గ్రంధి శ్రీను గుడ్ బై చెప్పారని అంటున్నారు. ఈ మేరకు తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపించారని తెలుస్తోంది.
దీంతో... గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారనే చర్చ మొదలైందని అంటున్నారు. ఇప్పటికే ఏలూరు నుంచి మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రంధి శ్రీను కూడా రాజీనామా చేశారని అంటున్నారు! మరి గ్రంధి శ్రీను నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది వేచి చూడాలి!