ఐసోలేషన్‌లో పెళ్లి కొడుకు..క్వారంటైన్‌లో పెళ్లి కూతురు ..ఏం జరిగిందంటే ?

Update: 2020-06-13 09:50 GMT
ఎన్నో కళలు , మరెన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ నవజంట పెళ్లి జరిగిన మరుసటి రోజే ఒకరు క్వారంటైన్కు , మరొకరు ఐసోలేషన్‌ కు వెళ్లారు. అదేంటి ఎక్కడైనా కొత్తగా పెళ్ళైతే ..హానీమూన్ కోసం ఏ  గోవా, ఊటి, కొడైకెనాల్.. లేదా మరేదైనా ప్రాంతానికో వెళ్ళాలి కదా అని అనుకుంటున్నారా? పాపం వీరికి ఆ అదృష్టం లేదు.

ఈ ఘటన పై పూర్తివివరాలు చూస్తే... కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఈనెల 10న పెళ్లి నిశ్చయం కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోకి వచ్చే సమయంలోనే వైరస్ నిర్ధారణ కోసం శాంపిల్స్ ఇచ్చాడు. అయితే ఫలితాలు వచ్చేందుకు సమయం పట్టడంతో ఈలోపే ముందుగా నిశ్చయమైన ప్రకారం వెల్దుర్తి మండలం ఎల్.తండాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం అదే రోజు రాత్రి రిసెప్షన్ నిర్వహించి బంధు మిత్రులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. రిసెప్షన్ జరుగుతుండగానే పెళ్లి కొడుకు అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో అతడు ఇచ్చిన శాంపిల్స్ ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో అతడికి  వైరస్ పాజిటివ్ ‌గా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో వెంటనే పెళ్లి కొడుకును ఐసోలేషన్ కేంద్రానికి, వధువును క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

రిసెప్షన్ వేడుకలో సహపంక్తి భోజనాలు చేసినట్టు అధికారులు గుర్తించి గ్రామాన్ని కంటైన్‌ మెంట్ జోన్‌గా గుర్తించారు. అనంతరం 70 కుటుంబాలనుంచి శాంపిల్స్ సేకరించి.. కొంతమందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Tags:    

Similar News