జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నోళ్ల మీద చర్యలు ఉండవా?

Update: 2020-08-25 09:10 GMT
కరోనా రోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ చాలా రాష్ట్రాల్లో కనిపించదు. ఎక్కడి దాకానో ఎందుకు.. ఆసుపత్రుల్లోనూ.. క్వారంటైన్ సెంటర్లలో కరోనా బాధితులకు ఆహారం ఇచ్చేందుకు భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది జగన్ సర్కారు. చాలా రాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇంత భారీగా ఖర్చు చేస్తున్నా.. జగన్ సర్కారుకు తిప్పలు తప్పట్లేదు.

కొద్ది మంది స్వార్థం.. ప్రభుత్వ విధానాలకు భిన్నంగా వ్యవహరించిన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఒంగోలులోని ట్రిపుల్ఐటీ కాలేజీలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి వారికి ఆహారం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేవారు. అయితే.. వారికి ఇస్తున్న అన్నం పాచిపోయి ఉండటం.. కూరలు ఉడకని రీతిలో ఉండటంతో పాటు.. మురిగిపోయిన కోడిగుడ్లు ఇస్తున్న దుర్మార్గ తాజాగా బయటకు వచ్చింది.

సదరు కోవిడ్ సెంటర్లో బాధితులకు అందుతున్న ఆహారాన్ని చూసిన వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఒక్కో రోగిపై రోజుకు రూ.400లకు పైనే ఖర్చు చేస్తుంది. అందుకు భిన్నంగా పాచిపోయి.. అశుభ్రంగా ఉన్న ఆహారాన్ని అందించటాన్ని తప్పు పడుతున్నారు. అంతేకాదు.. డైట్ విషయంలో దారుణమైన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

కరోనా బాధితుల్లో షుగర్ పేషెంట్లు ఉంటే.. వారికి చక్కెర కలిపిన రాగిజావ ఇవ్వకూడదు. అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కరోనా వేళ.. బలవర్థకమైన ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అందుకే.. మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా డైట్ మొత్తాన్ని చెల్లిస్తోంది జగన్ ప్రభుత్వం. కానీ.. ఆ కాంట్రాక్టులు పొందిన వారి స్వార్థం ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది.

కాసుల కక్కుర్తితో వారు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అందిస్తున్న ఆహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటికి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనే పోస్టు చేస్తున్నారు. కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేసి మరీ జగన్ ప్రభుత్వం విమర్శల్ని ఎదుర్కోవాల్సి రావటం గమనార్హం.
Tags:    

Similar News