ఏపీలో ఆ పాఠశాలలో కరోనా కలకలం..మూసివేత!

Update: 2021-03-16 10:33 GMT
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. పత్తికొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. రెండు రోజుల క్రితం వీరిద్దరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో, నిన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ టెస్టుల్లో వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, పాఠశాలను మూసివేశారు. ఈరోజు నుంచి స్కూలును మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడటంతో... ఆ స్కూల్లో చదువుతున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ప్రైమరీ కాంటాక్ట్ ‌లను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు, మిగతా విద్యార్థులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా హోంక్వారంటైన్‌ లో ఉన్నారు. మరోవైపు, రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.  కాగా, తిరుమలలో మరోసారి కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. మార్చి 10న ధర్మగిరి వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా,  సోమవారం మరో 10 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. సోమవారం వేద పాఠశాలలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నలుగురు అధ్యాపకులు, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని వెంటనే పద్మావతి కోవిడ్ హాస్పిటల్‌కు తరలించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

వేదపాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటంతో.. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35 మందికి కరోనా సోకిందని సోమవారం రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 476 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1443 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News