బన్నీని టార్గెట్ చేయాల్సిన అవసరం రేవంత్ సర్కారుకు ఏల?

అల్లు అర్జున్ అరెస్టు ఎందుకు జరిగింది? ఈ ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఆసక్తికర చర్చగా మారింది. అరెస్టుకు సంబంధించిన కారణాల్ని స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రే ఓపెన్ గా చెప్పేసిన తర్వాత.. చర్చేంది? అనుకోవచ్చు.

Update: 2024-12-15 10:30 GMT

అల్లు అర్జున్ అరెస్టు ఎందుకు జరిగింది? ఈ ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఆసక్తికర చర్చగా మారింది. అరెస్టుకు సంబంధించిన కారణాల్ని స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రే ఓపెన్ గా చెప్పేసిన తర్వాత.. చర్చేంది? అనుకోవచ్చు. కానీ.. మాటలు చెప్పినంత మాత్రాన అదే నిజమని ఎందుకు అనుకోవాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. అల్లు అర్జున్ అభిమానులు.. ఆయన్ను ఆరాధించే వారంతా చేస్తున్న ఆరోపణలే దీనికి కారణం.

తమ అభిమాన నటుడ్ని రేవంత్ సర్కారు టార్గెట్ చేసిందని.. తొక్కిసలాటకు.. ఒక మహిళ ప్రాణం పోవటానికి అల్లు అర్జున్ ను ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. అంతేకాదు.. పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ.. అదే నిజమైతే.. అల్లు అర్జున్ స్థాయి ప్రముఖుడ్ని ప్రభుత్వ అనుమతి లేకుండా అరెస్టు చేసే సాహసం పోలీసులకు ఉందా? అన్నది మరో ప్రశ్న.

ఇలా ప్రశ్నకు మరో ప్రశ్న ఎదురు కావటం.. దానికి సమాధానం అంతే ధీటుగా ఉండటం కనిపిస్తుంది. ఇదంతా చూసినప్పుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం అంత ఆషామాషీగా జరిగిందేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం.. అల్లు అర్జున్ అరెస్టు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన లైవ్ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలే. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం మీద ఆచితూచి మాట్లాడుతూనే.. పోలీసుల చర్యను సమర్థించుకోవటం కనిపిస్తుంది.

ఒక ప్రముఖుడ్ని అరెస్టు చేసిన వైనమే కాదు..దానిపై వస్తున్న విమర్శలకు కౌంటర్ వాదనను ముఖ్యమంత్రి రేవంత్ బలంగా వినిపించటం చూస్తే.. అరెస్టు.. తదనంతర పరిణామాలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రిపరేషన్ ప్రభుత్వ పరంగా కూడా జరిగిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే బన్నీని రేవంత్ సర్కారు టార్గెట్ చేసిందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.

ఇలా వాదనలు చేసే వారికి ఒక సూటి ప్రశ్న ఎదురవుతోంది. ఒకవేళ.. నిజంగానే రేవంత్ సర్కారు బన్నీని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకొని.. వేధింపులకు దిగి.. సమయం చూసుకొని అరెస్టు చేసిందన్నదే నిజమైతే.. దానికి రోజుల వ్యవధిలోనే పుష్ప2 రిలీజ్ వేళ బెనిఫిట్ షోకు.. ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత భారీ రేట్లు వసూలు చేసుకునే అవకాశాన్ని అధికారికంగా ఎందుకు ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా.. రిలీజ్ డేట్ కు ముందు రోజు సాయంత్రం నుంచే స్పెషల్ షోలు వేసుకోవటానికి అనుమతులు ఎందుకు ఇస్తారు? అన్నది మరో ప్రశ్న.

ఇదంతా చూసినప్పుడు అల్లు అర్జున్ ను రేవంత్ సర్కారు టార్గెట్ చేసిందన్న వాదనలో పస లేదని చెప్పాలి. మరి.. తొక్కిసలాట లాంటి ఉదంతాలు.. అల్లు అర్జున్ అలియాస్ పుష్పను అరెస్టు చేసి జైలుపాలు అయ్యేలా చేయాల్సిన అవసరం ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు కంటికి కనిపించే నిజాలకు భిన్నంగా.. లాజిక్కులకు అందని లెక్కలేవో బన్నీ అరెస్టుకు కారణమై ఉంటుందన్నదిప్పుడు చర్చగా మారింది. లోగుట్టు పెరుమాళ్లకు ఎరున అన్నది ఇందుకేనేమో?

Tags:    

Similar News