కుంభమేళా ఆర్థిక లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే

ఇంత భారీ కార్యక్రమం ఒకటి జరుగుతన్నప్పుడు ఆర్థిక అంశాలు రాకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి. వాటికి సంబంధించి లెక్కల్ని చూస్తే..

Update: 2025-01-15 13:30 GMT

చూడముచ్చట అధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంటే పాడు లెక్కలు వేస్తారా? అన్న భావన కలుగొచ్చు. కానీ.. అది నిజం. ఎందుకంటే ప్రతి అంశంలోనూ ఆర్థికం ఉంటుంది. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. నిన్నటి రోజున (మంగళవారం) జరిగిన మొదటి పవిత్ర స్నానానికి 3-4 కోట్ల మంది భక్తులు హాజరైనట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ కుంభమేళాకు ఈసారి దగ్గర దగ్గర 40 కోట్లకు పైగా ప్రజలు హాజరవుతారని చెబుతున్నారు.

ఇంత భారీ కార్యక్రమం ఒకటి జరుగుతన్నప్పుడు ఆర్థిక అంశాలు రాకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి. వాటికి సంబంధించి లెక్కల్ని చూస్తే.. ఔరా అనుకోకుండా ఉండలేం. గంగా.. యమునా.. సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేయటం తెలిసిందే. మొత్తం 45 రోజుల పాటు సాగే ఈ మెగా అధ్యాత్మిక కార్యక్రమంలో మొత్తం ఆరు పవిత్ర స్నానాలు జరుగుతాయి. అందులో మొదటిది జనవరి 13 కాగా.. రెండో పవిత్ర స్నానం జనవరి 14 జరుగుతుంది. మూడో పవిత్ర స్నానం జనవరి 29న.. నాలుగో పవిత్ర స్నానం ఫిబ్రవరి 3న జరగ్గా.. ఐదో పవిత్ర స్నానం ఫిబ్రవరి 12న జరగనుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా చివరి పుణ్య స్నానంతో కుంభమేళా పూర్తి కానుంది.

సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళా కారణంగా ఉత్తరప్రదేశ్ కు భారీగా ఆదాయం సమకూరనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చు చేయగా.. ఈ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం రానున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

కుంభమేళాకు హాజరయ్యే భక్తులు సగటున రూ.5వేలు ఖర్చు చేస్తే.. రూ.2 లక్షల కోట్లు.. అదే ఈ ఖర్చు రూ.10వేలు దాటితే రాష్ట్ర యఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2019లో జరిగిన అర్థ కుంభమేళా సమయంలో యూపీ రాష్ట్ర ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసింది. ఎందుకంటే.. అప్పట్లోనే రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన ఈ అధ్యాత్మిక కార్యక్రమానికి 24 కోట్ల మంది హాజరైనట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు అర్థమైందా? కుంభమేళాలో ఎంత భారీ ఆర్థిక అంశాలు దాగి ఉన్నాయో?

Tags:    

Similar News