చైనా జాతీయుడి సంచలనం.. కరోనాను మా దేశం దాచి పెట్టింది

Update: 2021-01-29 14:30 GMT
ఝుంగ్ హై.. ఇతడి పేరు ఇప్పటివరకు విని ఉండకపోవచ్చు. కానీ.. రానున్న రోజుల్లో ఇతగాడి మాటల మీద చర్చ.. అంతకు మించిన రచ్చ ప్రపంచవ్యాప్తంగా జరిగే వీలుంది. ఎందుకంటే చైనా లాంటి దేశంలో నిజాన్ని నిర్భయంగా చెప్పటం అంత తేలికైన విషయం కాదు. ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి గురించిన వాస్తవాల్ని డ్రాగన్ దేశం ఇప్పటికి బయటపెట్టింది లేదు. ఇలాంటివేళ.. కరోనా బారిన పడిన తన తండ్రిని పోగొట్టుకున్న ఝుంగ్ హై నోరు విప్పాడు.

తనకు జరిగిన అన్యాయానికి అధికారికంగా దేశం క్షమాపణలు చెప్పే వరకు విషయాన్ని వదిలిపెట్టనంటూ తేల్చి చెబుతున్న అతడి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కరోనా వైరస్ మూలాల్ని శోధించేందుకు చైనాలోని వూహాన్ లో అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగిన వేళ.. చైనీయుడు చేసిన వ్యాఖ్యలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

వైరస్ వ్యాప్తి మొదలైన వెంటనే ఆ విషయాన్ని ప్రకటించటంలో చేసిన జాప్యం వల్లే తన తండ్రి కరోనా బారిన పడి బలయ్యాడని ఆ వ్యక్తి వాపోతున్నాడు. తన తండ్రికి అవసరమైన సర్జరీ కోసం తమ కుటుంబం గత జనవరిలో షెన్ ఝెన్ నగరం నుంచి వూహాన్ కు వచ్చింది. అక్కడే కరోనా సోకి మరణించాడు. వూహాన్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని చెప్పి ఉంటే.. తాము అక్కడకు వెళ్లే వాళ్లమే కాదని.. తన తండ్రి మరణించేవాడు కాదని ఝుంగ్ చెబుతున్నాడు.

ఆ నేరానికి పాల్పడిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని.. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్న ఆయన.. ఈ విషయం తేలే వరకు తాను విశ్రమించనని చెబుతున్నాడు. ఆన్ లైన్ వేదికగా ఝుంగ్ చేస్తున్న పోరాటాన్ని చైనా అధికారులు అణగదొక్కుతున్నారని మండిపడుతున్నాడు. ఇప్పటికే అతని ఇంటికి పోలీసు అధికారులు వెళ్లటం.. హెచ్చరించటం లాంటివి చేస్తున్నారు. స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికి తాను భయపడనని చెబుతున్న అతడు.. వీబోలో తెరిచిన ఆరు ఖాతాల్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఇతగాడు వెల్లడించే విషయాలు రానున్న రోజుల్లో సంచలనంగా మారతాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News