తీవ్రస్థాయిలో వైరస్: రేపు, ఎల్లుండి సీఎంలతో ప్రధాని వీసీ

Update: 2020-06-13 03:30 GMT
అమెరికాలో మాదిరి దేశంలో మహమ్మారి వైరస్ విజృంభిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో లక్ష దాటగా తమిళనాడులో 40 వేలకు కేసులు చేరాయి. మిగతా రాష్ర్టాల్లో కూడా ఇదే మాదిరి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. దాదాపు నెల రోజుల తర్వాత సీఎంలతో ప్రధాని మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

దేశంలో అత్యధికంగా వైరస్ ఒక్క మహారాష్ట్రలోనే ఉంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం వరకు 1,01,141 కేసులు నమోదయ్యాయి. ఇవి కొన్ని దేశాల కన్నా అధికంగా ఉన్నాయి. ఇక తమిళనాడులో 40,698 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది. ఈ విధంగా కేసులు భారీగా నమోదవుతుండడం, లాక్ డౌన్.. దేశంలో వైరస్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంలతో మాట్లాడనున్నారు. 

జూన్ 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? వైరస్ నివారణ చర్యలు ఎలా తీసుకుంటున్నారు? లాక్ డౌన్ అమలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Tags:    

Similar News