దేశంలో వ్యాక్సిన్ ముందు ఎవ‌రికో చెప్పేసిన కేంద్ర‌మంత్రి

Update: 2020-10-12 06:01 GMT
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా కార‌ణంగా మ‌నిషి జీవితం ఆగ‌మాగ‌మైంది. సంప‌న్నుడి మొద‌లు సామాన్యుడి వ‌ర‌కు అంద‌రూ.. దాని బారిన ప‌డినోళ్లే. అత్యంత ప్ర‌ముఖులు మొద‌లు సాదాసీదా జీవితాలెన్నో ముగిసిపోయాయి. మాన‌వాళి చ‌రిత్ర‌లో 2020 మ‌ర్చిపోలేని చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొద‌ట్నించి అనుకున్న‌ట్లు.. వ్యాక్సిన్ జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ప‌క్షంలో దేశంలో పంపిణీ ఎలా ఉండ‌నుంది? ఎవ‌రికి ముందు వేస్తారు?  వారిని ఎలా గుర్తిస్తారు?   లాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ప‌లువురిలో మెదులుతున్నాయి. ఇలాంటి సందేహాల‌కు స‌మాధానాలు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిహ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పేర్కొన్నారు.

తాజాగా ఆయ‌న చెప్పిన మాట‌ల ప్ర‌కారం చూస్తే.. తొలినాళ్ల‌లో వ్యాక్సిన్ చాలా ప‌రిమితంగానే ఉండే  అవ‌కాశం ఉంద‌న్నారు. ఆరోగ్య రీత్యా తీవ్రమైన ముప్పు ఎదుర్కొనే వారికి.. మ‌ర‌ణం ముప్పు ఉన్న వారికి.. ప్రొఫెష‌న్ ప్ర‌కారం రిస్కు ఎక్కువ‌గా ఉన్న ఉద్యోగాలు చేసే వారికి ముందు ప్రాధ్యాన‌త క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆర్థిక‌వ్య‌వ‌హారాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఉద్యోగులు.. యువ‌కుల‌కు కూడా వ్యాక్సిన్ వేయ‌టంలో అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారంలో ఏ మాత్రం నిజం లేద‌ని.. అవ‌న్నీ అబ‌ద్ధాలుగా ఆయ‌న కొట్టిపారేశారు.

విభిన్న ర‌కాల వ్యాక్సిన్లు దేశంలోకి అందుబాటులోకి రానున్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. సండే సంవాద్ కార్య‌క్ర‌మంలో భాగంగా.. దేశ‌వ్యాప్తంగా సంధించిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తులు ఇచ్చే అంశంగా నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. చ‌ర్చ‌ల స్థాయిలోనే ఇవి ఉన్న‌ట్లుగా చెప్పారు. క‌రోనా వ్యాక్సిన్ పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్.. 1..2..3.. ద‌శ‌ల్లో ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. త‌మ వ‌ద్ద ఉన్న డేటా ప్ర‌కారంగా వ్యాక్సిన్ వినియోగం ఉంటుంద‌ని చెప్పిన కేంద్ర‌మంత్రి మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

వ్యాక్సిన్ త‌యారీలో ముందంజ‌లో ఉంద‌న్న ప్ర‌చారం సాగుతున్న సీరం.. భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లు త‌యారు చేసే వ్యాక్సిన్ల‌ను రెండు ద‌ఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. క్యాడిలా హెల్త్ కేర్ టీకాను మూడు ద‌శ‌ల్లో తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఎక్కువ వ్యాక్సిన్ల‌ను అనుమ‌తించే అంశంపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌న్నారు. భార‌త్ లాంటి దేశంలో ఒకే సంస్థ‌కు చెందిన టీకాల పంపిణీ సాధ్యం కాద‌న్నారు. మొత్తంగా వ్యాక్సిన్ వ‌చ్చే స‌మ‌యానికి ఎవ‌రికి ఎప్పుడు ఇవ్వాల‌న్న దానిపై ప‌క్కా ప్లానింగ్ జ‌రుగుతున్న విష‌యాన్ని కేంద్ర‌మంత్రి త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.
Tags:    

Similar News