ఇండియాలో కరోనా.. ఆనందాన్నిచ్చే అప్‌డేట్లు

Update: 2020-10-14 05:30 GMT
జనాలు కరోనా గురించి భయపడే.. వైరస్‌కు సంబంధించి అప్‌డేట్లు తెలుసుకునే రోజులు పోయాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా కరోనాతో సహజీవనం చేయడం నేర్చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఐతే ఈ పరిస్థితి రెండు మూడు నెలల ముందే వచ్చేసింది. కాకపోతే అప్పుడు కరోనా తీవ్రత తక్కువేమీ లేదు. అంతకంతకూ పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు. గత రెండు వారాల్లో మాత్రం కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుండటం శుభ పరిణామం. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కరోనా కర్వ్ కిందికి దిగే పరిణామం ఇప్పుడు చూస్తున్నాం. ఒక దశలో ఇండియాలో రోజువారీ కరోనా మరణాలు 1500 మార్కును కూడా టచ్ చేశాయి. క్రమం తప్పకుండా వెయ్యికి పైగా రోజు వారీ మరణాలు వరుసగా నమోదవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

ఐతే గత పది రోజుల్లో ఒక్క రోజు కూడా రోజువారీ మరణాల సంఖ్య వెయ్యి మార్కును టచ్ చేయలేదు. వరుసగా పది రోజులు వెయ్యి లోపు మరణాలు నమోదవడం కచ్చితంగా శుభపరిణామమే. అలాగే రోజులో వచ్చే కొత్త కేసుల కంటే ఆ రోజు కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వరుసగా పదో రోజట. ముందు రోజు కంటే తక్కువ మరణాలు నమోదు కావడం వరుసగా ఆరవ రోజట. కొత్త కేసుల కంటే కోలుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కోలుకున్న వారి శాంతం 86.8 శాతానికి చేరుకుంది. చికిత్స అందుకుంటున్న వారు ఇంకా 8 లక్షల 38 వేల మంది ఉన్నారు. సెప్టెంబరు నుంచి రోజుకు ఇండియాలో పది లక్షలకు పైగానే పరీక్షలు జరుపుతున్నారు. మొదటి మూడు వారాలు మాత్రం కేసులు పెరిగాయి. ఆ తర్వాత క్రమేపీ కేసుల సంఖ్య తగ్గుతుండటం మంచి విషయం. ఒక దశలో రోజు వారీ కేసులు 95 వేల మార్కును అందుకున్న సంగతి తెలిసిందే. ఇక లక్ష మార్కును టచ్ చేయడమే తరువాయి అనుకున్నారు. కానీ అక్కడి నుంచి కర్వ్ కిందికి దిగడం మొదలైంది. ప్రతి రోజు నమోదయ్యే కేసుల సంఖ్య 90 వేల దిగువనే ఉండటం వరుసగా 23వ రోజు కాగా.. ఇందులో 80 వేలకు తక్కువగా ఉన్న రోజులు 11. 75 వేల కంటే తక్కువగా వరుసగా ఐదు రోజులు నమోదయ్యాయి.
Tags:    

Similar News