ప్రపంచానికి భిన్నంగా దేశంలో టీకాలపై ఆసక్తి నిల్

Update: 2021-01-28 23:30 GMT
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు పలు సంస్థలు వ్యాక్సిన్ ను సిద్ధం చేశాయి. వీటిని సొంతం చేసుకోవటానికి పలు దేశాలు కిందా మీదా పడుతున్నాయి. ఎంత డబ్బు వెచ్చించి అయినా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చాలా దేశాల్లో టీకాలు దొరక్క విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా మన దేశంలో పరిస్థితి ఉంది.

టీకాలు అందుబాటులోకి వస్తున్నా.. వీటికి ఆదరణ ఉండటం లేదు. వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తిని చూపించటం లేదు. తప్పదన్నట్లుగా వేసుకునేటోళ్లే కనిపిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకునే అవకాశం వచ్చినా.. దాన్ని తప్పించుకోవటానికి సాకులు చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల తయారీ సంస్థ సీరమ్ మన దేశంలోనే ఉంది. ఇక్కడి నుంచే విదేశాలకు టీకాలు వెళుతున్నాయి. వాటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

కానీ.. మన దేశంలో అదే వ్యాక్సిన్ ఇస్తున్నా.. వేసుకోవటానికి ముందుకు రావటం లేదు.ఏ మాత్రం అవకాశం లభించినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేటోళ్లే ఎక్కువగా ఉంటున్నారు. మరే దేశంలో లేని ప్రత్యేకత మన దేశంలో ఉంది. టీకాల తయారీలో మనకున్న అవకాశాలు ప్రపంచంలోని మరే దేశానికి లేదని చెప్పాలి. కేవలం ఎగుమతుల కోసమే నెలకు 50 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకుంది. అది కూడా రెండు సంస్థలకు చెందినవే. ఈ లెక్కన మిగిలిన వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేసే వాటిని పరిగణలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటికి అదనంగా దేశీయంగా వినియోగించే టీకాలు.

ఈ నెల 16నుంచి దేశంలో వ్యాక్సినేషన్ మొదలైంది. తొలి విడతలో వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే టీకాల్ని ఇచ్చారు. తొలి విడతలో పెట్టుకున్న లక్ష్యంలో 56శాతం మాత్రమే పూర్తి అయ్యింది. దీనికి కారణం.. వ్యాక్సిన్ వేసుకోవటానికి సిద్ధంగా లేకపోవటమే. దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లు (కోవిషీల్డ్.. కోవాగ్జిన్) మూడో దశ ట్రయల్స్ పూర్తిస్థాయిలో జరగకపోవటంతో.. టీకా తీసుకోవటానికి చాలామంది సందేహిస్తున్నారు.

వ్యాక్సిన్ వేసుకోవటానికి వెనక్కి తగ్గుతున్న వారిలో ఆరోగ్య సిబ్బంది మాత్రమే కాదు.. వైద్య సిబ్బంది ఎక్కువగానే ఉన్నారు. మరింత వివరంగా చెప్పాలంటే వైద్యులు కూడా టీకా వేసుకోవటానికి సిద్ధం లేరన్న మాట వినిపిస్తోంది. ఇదే తీరు కొనసాగితే జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News