హైదరాబాద్ ఆసుపత్రి నిర్వాకం.. 15 రోజుల వైద్యానికి రూ.12లక్షలు

Update: 2020-07-08 08:15 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. మహమ్మారి బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పటం గుర్తుండే ఉండాలి. వారికి నిర్దారణ పరీక్షలతో పాటు.. వైద్యానికి అనుమతిచ్చే ఇబ్బందులు తప్పవంటూ ఆయన స్పష్టంగా చెప్పేవారు. ఎప్పుడైతే కేసుల సంఖ్య పెరగటం మొదలైందో.. అప్పటి నుంచి ఒత్తిడి పెరగటంతో.. ప్రభుత్వంపై వస్తున్న విమర్శల్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యానికి ఓకే చెప్పేశారు.

ఈ నేపథ్యంలో పలు ఉదంతాలు బయటకు వస్తున్నాయి. మొదట్లో పది రోజుల వైద్యానికి లక్ష నుంచి లక్షన్నర వరకూ ఖర్చు అవుతుందన్న స్థానే.. ఇప్పుడు రోజుకు దగ్గర దగ్గరగా లక్ష మేర బిల్లు వేస్తున్న వైనం షాకిస్తోంది. ఈ భారీ మొత్తాల్ని తీర్చేందుకు వీలుగా ఉన్న ఆస్తుల్ని అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది.

యాదగిరి గుట్టకు చెందిన 28 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో గత నెల 23న సికింద్రాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరిన తర్వాతి రోజున అతడికి పరీక్ష చేయించగా.. నెగిటివ్ వచ్చింది. మరో రెండు రోజుల తర్వాత (జూన్ 26న) మరోసారి పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అతడికి పాజిటివ్ గా తేలింది. ఇదిలా ఉంటే.. మంగళవారం అతడు మరణించాడు.

మొత్తం పదిహేను రోజుల వైద్యానికి ఏకంగా రూ.12లక్షల మొత్తాన్ని బిల్లుగా వేశారు. అప్పటికేరూ.6.5లక్షల మొత్తాన్ని చెల్లించారని.. మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని బాధితులకు ఆసుపత్రి వర్గాలు చెప్పటంతో. . వారు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పొలం అమ్ముకొని మరీ వైద్యానికి డబ్బులు కట్టామని.. ఇక తామేమీ కట్టలేమని తేల్చేశారు. బాధితుడి బంధువులు చేసిన ఆందోళన పెరుగుతున్న వేళ.. సదరు కార్పొరేట్ ఆసుపత్రి వెనక్కి తగ్గి.. యువకుడి డెబ్ బాడీని అంత్యక్రియలకు పంపించింది.
Tags:    

Similar News