తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందట.. ఎవరు ఎవరికి చెప్పారంటే?

Update: 2020-07-08 10:30 GMT
ఏ మాటకు ఆ మాట కొన్ని విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణలో.. మహమ్మారి తీవ్రత ఎంత ఉందన్న విషయంపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన గవర్నర్ తమిళ సైకు తెలంగాణకు చెందిన  పలువురు ట్వీట్ల రూపంలో తమ ఆవేదనను చెప్పుకున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర సీఎస్  సోమేశ్ కుమార్ ను.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలను రాజ్ భవన్ కు రావాల్సిందిగా గవర్నర్ సమాచారం పంపారు. అయితే.. అప్పటికే తాము ముందుగా అనుకున్న షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున రాలేకపోతున్నట్లుగా సమాచారం పంపటం పెను సంచలనంగా మారింది. సాధారణంగా గవర్నర్ నుంచి పిలుపు వచ్చినప్పుడు అత్యున్నత అధికారులకు కలవటం సాధ్యం కాకుంటే.. తమ కిందిస్థాయి అధికారుల్ని పంపి.. పరిస్థితిని వివరించే ఆనవాయితీని పక్కన పెట్టేయటం చర్చగా మారింది.

ఈ నేపథ్యంలో అప్పటికే పెరిగిన ఊహాగానాలకు చెక్ పెడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలు రాజ్ భవన్ కు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల వేళలో గవర్నర్ తో భేటీ అయిన వారు.. తెలంగాణలో మహమ్మారి తీవ్రత గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మహమ్మారి అదుపులో ఉందని పేర్కొనటం గమనార్హం. ఓపక్క రోజుకు పదహారు వందల వరకూ కేసులు నమోదవుతున్న వేళ.. పరిస్థితి కంట్రోల్ లో ఉందని ఎలా పేర్కొంటారన్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. కీలకమైన ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్ మెంట్ పార్ములాకు తాము కట్టుబడి ఉన్నట్లుగా గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం. అధిక లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నామని.. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నట్లు చెప్పారు. పాజిటివ్ కేసులున్న ఇళ్లనే కంటైన్మెంట్ జోన్లుగా మారుస్తున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీపై గవర్నర్ స్పందన ఎలా ఉందన్న విషయం బయటకు రాలేదు. ఏమైనా.. రోజు ఆలస్యంగా వెళ్లి.. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News