ఏపీ అసెంబ్లీకి డేటా చోరీ నివేదిక‌.. అందులో ఏముంది?

Update: 2022-09-20 15:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో తీవ్ర దుమారం రేపిన ఫోన్‌ ట్యాపింగ్, వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవహారాలపై శాసనసభ ఏర్పాటు చేసిన సభా సంఘం నివేదికను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సభా సంఘం చైర్మ‌న్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి సెప్టెంబ‌ర్ 20న శాస‌న‌ సభలో ప్రవేశపెట్టారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స‌మాచార కేంద్రంలో ఉండాల్సిన సమాచారాన్ని టీడీపీకి చెందిన వ్యక్తులకు నేరుగా చేర‌వేశార‌ని భూమ‌న తెలిపారు. ఈ మేర‌కు స‌భా సంఘం నివేదిక‌ను ఆయ‌న అసెంబ్లీలో చ‌దివి వినిపించారు. ఈ డేటా త‌స్క‌ర‌ణ‌తో టీడీపీ ప్ర‌త్యేక ల‌బ్ధి క‌లిగింద‌ని ఆరోపించారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్‌, డేటా చోరోపై ఏర్పాటు చేసిన సభా సంఘం వివిధ శాఖల అధిపతులు, అధికారులతో నాలుగుసార్లు ప్రత్యేకంగా సమావేశమైనట్లు చెప్పారు. వ్యక్తుల‌ ప్రైవేట్ సమాచారాన్ని చౌర్యం చేసినట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌న్నారు. గత మార్చిలో ఈ వ్యవహారంపై సభా సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పలు దఫాలుగా విచారణ జరిపి ఈ విష‌యాన్ని నిర్ధారించిన‌ట్టు భూమన కరుణాకర్‌ రెడ్డి చెప్పారు.

2016 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడిందని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాలపై రాష్ట్ర శాసన సభ ఏర్పాటు చేసిన సభా సంఘం నాలుగు సార్లు భేటీ అయ్యిందని తెలిపారు.

దీనిపై వివిధ శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి, వివరాలు సేకరించామ‌న్నారు. త‌మ విచార‌ణ‌లో గ‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ సమాచారాన్ని దొంగిలించిదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిన విషయంలో స్ఫష్టమైన ఆధారాలు లభించాయని వెల్ల‌డించారు.

2018-19 మధ్య కాలంలో టీడీపీ ప్ర‌భుత్వం సేవా మిత్ర యాప్‌ ద్వారా 30 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించింద‌ని భూమ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం దొంగిలించింద‌ని.. ఈ మేర‌కు సభా సంఘం ప్రాథమిక నిర్ధారణకు వ‌చ్చింద‌న్నారు. సమాచార చౌర్యానికి సంబంధించి ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో టీడీపీకి ఓటు వేయని వారి సమాచారాన్ని, స్టేట్ పోర్టల్‌కు సంబంధించిన సమాచారాన్ని సేవా మిత్ర యాప్‌ ద్వారా చోరీ చేశారని భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. దీని లోతుల్లోకి వెళ్లి పరిశోధించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం నూటికి నూరు శాతం సమాచార చోరీ చేసిందని భూమన తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News