ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్సు.. ఆదివారం ఏం జరగనుంది?

Update: 2023-05-14 10:05 GMT
కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 224 స్థానాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని సాధించటం ద్వారా.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటంతో పాటు.. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన మెజార్టీని సొంతం చేసుకున్నారు. మరో ఏడాది వ్యవధిలో జరిగే లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ కీలక ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి టానిక్ గా మారుతుందని చెప్పాలి.

ఎన్నికల ఫలితాలు ముగిసిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు తీరుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. అట్టే ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12.30 గంటల వేళలో బెంగళూరులోని హిల్టన్ హోటల్ లో సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ) సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తారు.

సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధిష్ఠానం నుంచి వచ్చే సీల్డ్ కవర్ ఆధారంగానే ముఖ్యమంత్రిని డిసైడ్ చేయటం తెలిసిందే. ఇక.. సీఎల్పీ సమావేశం కావటం.. తమ నాయకుడిగా అధిష్ఠానం డిసైడ్ చేయాలని ప్రకటించటం.. వారు ఎవరిని ఎంపిక చేసినా.. తమ మద్దతు ఉంటుందని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెబుతారు. ఆ తర్వాత సీల్డ్ కవర్ లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నది రివీల్ అవుతుంది.

ఇక.. ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిన వెంటనే ప్రమాణస్వీకారోత్సవం వేదిక డిసైడ్ అయ్యింది. ఇక.. తేలాల్సింది ఎన్ని గంటలకు అన్న ముహుర్తం మాత్రమే.  ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. మే 15 (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం నుంచే కొత్త సర్కారు అధికారాన్ని చేపట్టనుంది. ఇక.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానికి బరిలో ఇద్దరు అగ్రనేతలు ఉన్నారు.

వారిలో ఒకరు మాజీముఖ్యమంత్రి సీనియర్ నేత సిద్దరామయ్య కాగా.. మరొకరు పార్టీ ట్రబుల్ షూటర్.. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రథసారధి డీకే శివకుమార్. వీరిద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావటం ఖాయం. ఎంపికైన వారు.. కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటకకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ రోజు (ఆదివారం) సాయంత్రానికి తేలిపోనుందన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటివరకు వెల్లడైన సర్వేల ప్రకారం చూస్తే.. అత్యుత్తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెజార్టీ ప్రజలు సిద్దరామయ్యకు ఓటేశారు. రెండోస్థానంలో డీకే శివకుమార్ నిలిచారు. వీరిద్దరి మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని సిద్దను ఎంపిక చేస్తారా? లేదంటే.. పార్టీ కష్టకాలంలోఉన్న వేళలో అండగా నిలిచిన శివ వైపు మొగ్గు చూపుతారా? అన్నది తేలాల్సి ఉంది. 

Similar News