ఐపీఎల్​ లో రన్స్​కంటే.. డెత్​ రేట్​ ఎక్కువగా ఉంది.. అయినా ఆపరా?

Update: 2021-04-29 10:37 GMT
మనదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగుతున్న విషయం తెలిసిందే. కరోనాతో రోజుకు వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినప్పటికీ ఐపీఎల్​ కొనసాగుతోంది. ఓ వైపు దేశంలో ఆక్సిజన్​ దొరకక ప్రజలు చనిపోతుంటే.. ఐపీఎల్​ నిర్వహించడం భావ్యమేనా? అన్న వాదన బలపడుతోంది. మరోవైపు మేము అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ, ప్రేక్షకులను అనుమతించకుండా ఐపీఎల్​ కొనసాగిస్తున్నామని.. దీని వల్ల ఇబ్బంది ఏమిటని  బీసీసీఐ ప్రశ్నిస్తోంది.

ఇదిలా ఉంటే ఐపీఎల్​ లో మనదేశ ఆటగాళ్లతోపాటు విదేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతుంటారు. అయితే ఆయా దేశాల నుంచి ఆటగాళ్లకు ఒత్తిడి పెరుగుతోంది. వెంటనే భారత్​ను విడిచిపెట్టి రావడం మేలని.. వాళ్లను ఆయా దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే భారత్​లో పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఆ దేశంతో పలు దేశాలు రాకపోకలు నిలిపివేశాయి కాబట్టి.. వెంటనే భారత్​ను విడిచిపెట్టి రావాలని వాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని బీసీసీఐ చెబుతోంది. వాళ్లను భద్రంగా ఇంటికి చేర్చడం తమ బాధ్యత అని అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ అంటున్నది. అయినప్పటికీ ఐపీఎల్​ నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. పలు దేశాల మాజీ క్రికెటర్లు, క్రీడాకారులు ఐపీఎల్​ కొనసాగించడాన్ని తప్పుపడుతున్నారు.

తాజాగా ఈ విషయంపై ఇంగ్లండ్​ మాజీ ఫుట్​ బాల్​ ప్లేయర్​, కామెంటేటర్​ గ్యారీ లినేకర్‌ స్పందించాడు. 'ఐపీఎల్​ ను నేను ఎంతో ఎంజాయ్​ చేస్తా. కానీ ప్రస్తుతం భారత్​ లో పరిస్థితులు ఏమంత బాగా లేవు. అక్కడ ఐపీఎల్​ పరుగుల కంటే ప్రాణాలు వేగంగా పోతున్నాయి. రోజుకు వేలమంది చనిపోతున్నారు. శ్మశానాల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్​ నిర్వహించడం భావ్యమేనా' అంటూ ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ పత్రిక గార్డియన్​ సైతం ఐపీఎల్​ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ' ఐపీఎల్​ ను ఎవరూ విమర్శకూడదు. ఎందుకంటే అది కాసులు కురిపిస్తోంది. అటువంటి పవిత్రకార్యాన్ని విమర్శిస్తే పాపాలు అంటుకుంటాయి' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖులు సైతం ఐపీఎల్​ నిర్వహణను తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్​ ఫ్యాన్స్​ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రేక్షకులను అనుమతించకుండా ఐపీఎల్ నిర్వహిస్తే తప్పేంటి? అని వారు స్పందిస్తున్నారు.
Tags:    

Similar News