భార‌త్ దాడుల‌తో పాక్‌కు దేవుడు క‌నిపించాడు

Update: 2016-11-26 09:19 GMT
భార‌త జ‌వాను త‌లను పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు న‌ర‌క‌డాన్ని పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించిన ఇండియ‌న్ ఆర్మీ.. దీనికి త‌గిన శాస్తి చెల్లించాల్సిందేనంటూ త‌ర్వాతి రోజు దాడుల‌ను ఉద్ధృతం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌ప‌డింద‌ని అంతేకాకుండా భార‌త్ చేప‌ట్టిన దాడుల‌ను ఆపాల్సిందిగా పాకిస్థాన్ వేడుకుంద‌ని ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ వెల్ల‌డించారు. పాక్ బ‌రితెగింపుపై భార‌త సైన్యం ప్ర‌ద‌ర్శించిన తెగువ‌- పాకిస్తాన్ పారిపోయిన తీరును కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి తాజాగా మీడియాకు వివ‌రించారు.

గ‌త‌ మంగ‌ళ‌వారం పాకిస్థాన్‌ ఓ భార‌త జ‌వాను త‌ల న‌రికిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ త‌ర్వాతి రోజు ప్ర‌తీకారంగా ఇండియ‌న్ ఆర్మీ నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న‌ పాక్ పోస్టుల‌పై దాడుల‌ను తీవ్రం చేసింది. పూంచ్‌, రాజౌరీ, కెల్‌, మ‌చిల్ సెక్టార్ల‌లోని పాక్ పోస్టుల‌పై కాల్పులు జ‌రుపుతూనే ఉండ‌టంతో బిక్క‌చ‌చ్చిపోయిన పాకిస్తాన్ కాళ్ల‌బేరానికి వ‌చ్చిన‌ట్లు పారిక‌ర్ చెప్పారు. రెండు రోజుల వ‌రుస దాడుల త‌ర్వాత పాకిస్థాన్ ఫోన్ చేసి.. దాడుల‌ను వెంట‌నే ఆపాల్సిందిగా వేడుకుంది అని పారిక‌ర్ తెలిపారు. అయితే కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతోంది మీరేన‌ని తాను గుర్తు చేసిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి వివ‌రించారు. "దాడులు ఆప‌డానికి మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. దాడులు జ‌ర‌పాల‌న్న ఆస‌క్తి లేద‌ని వాళ్ల‌కు చెప్పాము. అయితే అవ‌త‌లివైపు నుంచి క‌చ్చితంగా ఆగాల‌ని స్ప‌ష్టం చేశాం. దీంతో గ‌త రెండు రోజులుగా ఎలాంటి కాల్పుల ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు" అని పారిక‌ర్ అన్నారు. జ‌వాను త‌ల న‌రికినందుకు ప్ర‌తీకారంగా స‌రిహ‌ద్దులో పాకిస్థాన్ పోస్టుల‌పై దాడుల‌ను ఉద్ధృతం చేయ‌డంతో మ‌న ఆర్మీ స‌త్తా పాకిస్తాన్‌కు అర్థ‌మైంద‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News