కేజ్రీవాల్ ఉచిత అస్త్రంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి

Update: 2019-06-03 11:41 GMT
చేతిలో అధికారం ఉంటే ఆ వ్య‌వ‌హార‌మే వేరు. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా స‌రే.. ఎన్నిక‌ల ముందు ప్ర‌జా సంక్షేమం గురించి.. వారి ఇబ్బందుల గురించి పాల‌కుల్లో వచ్చే ఆలోచ‌న‌లు అన్ని ఇన్ని కావు. తాజాగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ న‌గ‌ర ప్ర‌జ‌ల ఇబ్బందులు గుర్తుకు రావ‌ట‌మే కాదు..వారికి తీపిక‌బురు చెబుతూ మెట్రో రైళ్లు.. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం చేసేలా నిర్ణ‌యం తీసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఈ ప‌థ‌కం కోసం ఖ‌ర్చు చేసే మొత్తం కోసం కేంద్రం మీద ఆధార‌ప‌డ‌మ‌ని.. తాము సొంతంగా నిధులు స‌మ‌కూర్చుకుంటామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలో.. అందునా ఢిల్లీ మ‌హాన‌గ‌ర‌మే కీల‌క‌మైన వేళ‌.. కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన తాయిలం అక్క‌డి ప్ర‌జ‌లు క‌నెక్ట్ కావ‌ట‌మే కాదు.. కేజ్రీవాల్ స‌ర్కారు మీద త‌మ క‌రుణా వీక్ష‌ణాల్ని చూప‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ఏడాది చివ‌ర్లో జ‌ర‌గ‌నున్నాయి. ఇటీవ‌ల వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆప్ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల్లో త‌మ ప్ర‌భుత్వం ప‌ట్ల త‌గ్గుతున్న ప్ర‌జాద‌ర‌ణ విష‌యంలో ఆలోచించిన కేజ్రీవాల్.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా మెట్రో రైలు.. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ ప్ర‌క‌ట‌న స‌ర్కారుకు సానుకూలంగా మారుతుందంటున్నారు.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా  బీజేపీ నేత‌ల స్పంద‌న ఉంది. ఓటర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌టానికే కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఇలాంటి తాయిలాలు ప్ర‌క‌టిస్తుంద‌ని ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడు.. ఎంపీ మ‌నోజ్ తివారీ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు నిజంగా మేలు చేయాల‌నుకుంటే కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని ఎందుకు అమ‌లు చేయ‌టం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఢిల్లీలోని పేద ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అవాస్ యోజ‌న‌.. వైద్య ప‌థ‌కాల‌ను సీఎం అమ‌లు చేయ‌క‌పోతే.. త్వ‌ర‌లోనే బీజేపీ అమ‌లు చేస్తుంద‌న్నారు. నిజంగా ప్ర‌జ‌ల మీద ప్రేమ ఉంటే ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ఎందుకు అమ‌లు చేయ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఇప్ప‌టి నుంచే ఓట‌ర్ల‌ను కొన‌టానికి సీఎం ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ నేత‌ల్లో క‌ల‌క‌లం రేప‌టం.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయ‌ట‌మే కేజ్రీ స‌ర్కారు ల‌క్ష్యం. చూస్తుంటే.. ఆయ‌న త‌న ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌గా వెళుతున్న‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News