ఢిల్లీలో పరిస్థితి మరీ అంత దారుణంగా ఉందా?

Update: 2020-06-26 04:45 GMT
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో కిందామీదా పడుతున్న పరిస్థితి. లాక్ డౌన్ నిబంధనలు కాస్త సడలించిన వెంటనే మొదలైన జోరు.. అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గని పరిస్థితి. దీంతో దేశంలోని మహానగరాల పరిస్థితి మహా దారుణంగా మారింది. అన్నింటికి మించి దేశ రాజధాని ఢిల్లీ.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.

కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్లు లభించని పరిస్థితి. దీంతో.. మహమ్మారి కమ్మేసిన వారికేం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఢిల్లీలో తొలిసారి కొత్త ప్రయోగానికి తెర తీశారు. భారీ బంకెట్ హాల్ ను వంద పడకల ఆసుపత్రిగా మార్చేశారు. దర్యగంజ్ లోని షెహనాయ్ బంకెట్ హాల్ ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేశారు.

ఢిల్లీ రాస్ట్రంలోనే అతి పెద్దదైన లోక్ నాయక్ జయప్రకావ్ నారాయణ హాస్పిటల్ కు అనుసంధానమై ఉంటుంది. వంద పడకల్ని ఏర్పాటు చేయటమే కాదు.. రోగుల్ని పర్యవేక్షించేందుకు యాభై మంది హెల్త్ కేర్ సిబ్బందికి బాధ్యతలు అప్పజెప్పారు. ఆనందించాల్సిన విషయం ఏమంటే.. ఈ బాంకెట్ హాల్ లో అందించే వైద్య సేవలకు ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. అన్ని ఉచితంగా ఇస్తారు.

చికిత్స పొందే  పేషెంట్ల ఖర్చును తామే భరిస్తామని డాక్టర్స్ ఫర్ యూ అనే స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రవికాంత్ సింగ్ వెల్లడించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి అత్యవసర పరిస్థితి ఎదురైతే.. అందుకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలోని మరో 80 బంకెట్ హాళ్లను సైతం కోవిడ్ ఆసుపత్రులుగా మార్చేందుకు వీలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. వీటి ద్వారా మరో పదకొండు వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News