హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లింది అంతమందా?

Update: 2020-04-01 05:00 GMT
కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయటంలో తాము చాలా ముందుచూపుతో వ్యవహరించినట్లుగా ఫీలైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేసింది ఢిల్లీ మత ప్రార్థనల ఘటన. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మత ప్రార్థనల కోసం దేశ వ్యాప్తంగా వేలాది మంది హాజరైతే.. తెలంగాణలో పదకొండు వందల మంది వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరం లోనే 603 మంది వెళ్లినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే.. ఈ అంకెలకు.. వాస్తవాలకు మధ్య దూరం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అందరూ అనుకున్నట్లుగా 603 మంది మాత్రమే వెళ్లారనటం తప్పని.. రైలు మార్గంలో వెళ్లిన వారి సంఖ్య ఇదని.. ఇతర మార్గాల ద్వారా వెళ్లిన వారి సంఖ్య మరింత ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక అంచనా ప్రకారం 900 మంది వరకూ హైదరాబాద్ నుంచి వెళ్లి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. అధికారిక లెక్కల్లో చూపిస్తున్న 603 మంది లో 463 మంది ఆచూకీని గుర్తించారు. మిగిలిన వారి గురించి వెతుకుతున్నారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నుంచి వెళ్లిన వారి సంఖ్య 900 వరకూ ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని 88 ప్రార్థనా మందిరాల నుంచి భారీగా బయలుదేరారని చెబుతున్నారు. విమానం.. రైలు.. బస్సు.. ఇలా ఎవరికి వీలైన మార్గంలో వారు ప్రయాణమైనట్లు చెబుతున్నారు. మీడియా సంస్థలు చెబుతున్నట్లుగా మార్చి 10.. 11 తేదీల్లో ఢిల్లీ వెళ్లినట్లుగా చెబుతున్నా.. అందులో నిజం లేదని.. ఐదారు తారీఖుల్లోనే నగరం నుంచి బయలుదేరానని.. ప్రార్థనలు పూర్తి అయ్యాక మార్చి 17 నుంచి 19 మధ్యలోనే హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లుగా చెబుతున్నారు.

లాక్ డౌన్ తదితర పరిణామాల నేపథ్యం లో ఇప్పటికి తమ వద్ద 1746 మంది ఉన్నట్లుగా మార్చి 21న నిర్వాహకులు ఢిల్లీ పోలీసులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఇంకెంతమంది ఉన్నారన్న విషయం మీద స్పష్టత రాలేదు. ఏమైనా.. హైదరాబాద్ మహానగరం నుంచి ప్రార్థనలకు భారీగా వెళ్లటం.. అది కూడా అందరూ అనుకున్నట్లు పాతబస్తీకే పరిమితం కాకుండా.. హైదరాబాద్ మహానగరం చుట్టు పక్కల అన్ని ప్రాంతాల నుంచి వెళ్లినట్లుగా తెలుస్తోంది.  
Tags:    

Similar News