ఢిల్లీలో లారీకి ఫైన్.. ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే

Update: 2019-09-13 05:23 GMT
కొత్త వాహన చట్టం ఏ ముహుర్తంలో స్టార్ట్ అయ్యిందో కానీ.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఈ వాహన చట్టాన్ని అమలు చేస్తున్న కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న ఉదంతాల్ని వింటున్న వారు.. తమ రాష్ట్రంలో ఈ తరహా ఫైన్లు విధిస్తే తమ సంగతేమిటన్న ఆందోళనకు గురి అవుతున్నారు.

వేలాది రూపాయిల ఫైన్లను ఇప్పటివరకూ వేసిన పోలీసులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా లక్షల్లో ఫైన్లు వేస్తూ ఠారెత్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీ రాష్ట్రంలో వేసిన ఫైన్ లెక్క తెలిస్తే అవాక్కు అవ్వటమేకాదు.. ఇప్పటివరకూ భారీ జరిమానాలుగా ఉన్న రికార్డులన్ని బ్రేక్ అయ్యేలా భారీ జరిమానాను విధించారు.

ఢిల్లీలోని ముకర్బా చౌక్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఉదంతంలో ఒక లారీ డ్రైవర్ కు ఏకంగా రూ.2.05లక్షల మొత్తాన్ని ఫైన్ గా విధించి  నోట మాట రాకుండా చేశారు. దీంతో.. దేశంలో ఇప్పటివరకూ పడిన అత్యధిక ఛలానాగా ఈ మొత్తం రికార్డుల్లోకి ఎక్కింది. అంతేనా.. ఈ లారీ డ్రైవర్ రామ్ కిషన్ ను అరెస్ట్ చేశారు కూడా. దీంతో.. అతగాడు లబోదిబోమంటున్నాడు.

 ఇంతకీ అంత భారీ ఫైన్ ఎందుకు పడింది?  సదరు లారీ ఓనర్ చేసిన తప్పేంటి? అన్న విషయాల్లోకి వెళితే.. పరిమితికి మించిన సామాన్లను లారీలో తీసుకెళ్లటంగా చెబుతున్నారు. లారీలో నిర్దేశించిన బరువుకు మించి సామాన్లను తీసుకెళితే.. ప్రతి అదనపు టన్నుకు రూ.2వేలు జరిమానా విధించాల్సి వస్తుంది. ఈ లెక్కన రూ.2.05 లక్షల చలానా అంటే.. నిబంధనల ఉల్లంఘన ఎంత భారీగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  

ఈ నెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వాహన చట్టం కారణంగా పోలీసులు వేస్తున్న భారీ జరిమానాలు వాహనదారులకు చుక్కలు చూపించటమే కాదు.. కొందరైతే భారీ జరిమానాల్ని కట్టలేక తాము నడుపుతున్న వాహనాల్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు.
Tags:    

Similar News