స్మితా సబర్వాల్ ఇంట్లోకి వెళ్లే ముందు ఆ ట్వీట్ చేశాడట

Update: 2023-01-24 09:02 GMT
హద్దులు.. సరిహద్దులు చాలా కచ్ఛితంగా తెలిసిన వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వచ్చే సమస్యలు.. కష్టాలు మామూలుగా ఉండవు. అందునా లక్ష్మణ రేఖను అసలే తాకకూడదు. ఆ మాటకు వస్తే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి మించిన అపాయం మరొకటి ఉండదు. అలాంటిది మరేం అనుకున్నాడో.. అసలేం జరిగిందో కానీ.. మేడ్చల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న 48 ఏళ్ల చెరుకు ఆనంద్ కుమార్ రెడ్డి.. అతని స్నేహితుడు కమ్ హోటల్ నిర్వహకుడైన కొత్త బాబుతో కలిసి కారులో సీఎంకార్యాలయ అధికారిణి.. సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి జొరబడిన వైనం సంచలనంగా మారటమే కాదు.. షాకింగ్ గా మారింది.

నగరంలోనే అత్యంత భద్రత ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఎమ్మెల్యే కాలనీలోని ప్లజెంట్ వ్యాలీలో.. నేరుగా అధికారిణి ఇంటి వరకు వెళ్లిపోవటం.. అది కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కావటం సంచలనమైంది. తనకు ఎదురైన షాకింగ్ ఉదంతాన్ని సమర్థంగా డీల్ చేసిన ఆమె.. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పటానికి కూడా సంకోచించకుండా స్ఫూర్తిగా నిలిచారని చెప్పాలి. హైదరాబాద్ నగర కమిషనరేట్ అయిన సీవీ ఆనంద్ నివాసానికి దగ్గర్లో ఉండే సదరు అధికారిణి నివాసానికి వెళ్లిన రెవెన్యూ అధికారి.. ఆమె ఇంట్లోకి వెళ్లే ముందు ట్విటర్ లో ట్వీట్ చేయటం గమనార్హం.

తాను ఇంటి గడప వద్ద ఉన్నట్లుగా అతడు పేర్కొన్నాడు. ఇదంతా చూస్తే.. ఆనంద్ కుమార్ రెడ్డికి మానసికంగా ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడా? కావాలనే ఇలా చేశాడా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి తోడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్లజెంట్ వ్యాలీ వద్దకు వచ్చిన కొత్త వ్యక్తుల్ని గుర్తించే విషయంలో అక్కడి భద్రతా సిబ్బంది అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? అన్నది ప్రశ్న.

నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చటం.. అతడికి రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను చేసే ఎదవ పనిని ట్వీట్ రూపంలో ఎందుకు పోస్టు చేసినట్లు? ఎలాంటి మైండ్ సెట్ తో ఇదంతా చేసినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. ‘‘మీ ఇంటి గుమ్మం వద్ద ఉన్నా’’ అంటూ ట్వీట్ చేసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఎంతో తెలిసిన వారి ఇంటికి సైతం ఇలా అర్థరాత్రి వేళలో వెళ్లటానికి ఒక పట్టాన వెళ్లరు. అలాంటిది నిందితుడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్మితా సభర్వాల్ ఇంటికి వెళ్లింది కూడా రాత్రి 11.40 గంటల ప్రాంతంలో కావటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా స్పందించారు. డిప్యూటీ తహసిల్దార్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇతడు 2018లో నిర్వహించిన గ్రూప్ లో ఎంపికై.. డిప్యూటీ తహసీల్దార్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యుటేషన్ మీద పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నారు. ఏమైనా.. చేసిన ఎదవ పనికి శ్రీక్రిష్ణ జన్మస్థానానికి చేరుకోవటమే కాదు.. మర్యాదతో కూడిన ఉద్యోగాన్ని సైతం పోగొట్టుకున్న వైనం చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News