కేసీఆర్ తో రాజ‌కీయాలు చ‌ర్చించ‌నేలేదు.. దేవేగౌడ సంచ‌ల‌నం

Update: 2022-02-16 09:13 GMT
జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తూ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఊహించ‌ని షాక్ ఎదురైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మతతత్వ పాలనకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని సీఎంతో మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ చ‌ర్చించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ మేర‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడార‌ని సీఎంఓ ప్ర‌క‌టించింది. అయితే, దీనిపై జేడీఎస్ ఘాటుగా స్పందించింది. దేవేగౌడ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చ‌ర్చించింది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ అందులో రాజ‌కీయాలు ప్ర‌స్తావ‌న‌కు రానేలేద‌ని స్ప‌ష్టం చేసింది.

విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ తన మద్దతు తెలిపారని తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో మంగ‌ళ‌వారం తెలిపింది.

దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్‌ను అభినందించిన దేవేగౌడ మీ యుద్దాన్ని కొనసాగించండి. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది అంటూ దేవేగౌడ కేసీఆర్ తో అన్నారని వివ‌రించింది. అయితే, ఈ ప్రక‌ట‌న‌లో వాస్త‌వం లేద‌ని జేడీఎస్ అధినేత‌ తెలియ‌జేసిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాక‌థ‌నం ప్ర‌చురించింది.

మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ ఫోన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో టెలీఫోన్లో మాట్లాడిన మాట నిజ‌మే అయిన‌ప్ప‌టికీ ఆ చ‌ర్చ‌ల్లో రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావ‌న రానేలేద‌ని జేడీఎస్ ర‌థ‌సార‌థి పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది.

జేడీఎస్ అధినేత మాట్లాడ‌ని అంశాల‌ను పేర్కొంటూ తెలంగాణ సీఎం కార్యాల‌యం ఎలా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంద‌ని సైతం ఆయ‌న‌ షాక్ అయిన‌ట్లు వివ‌రించింది. ఈ ప‌రిణామం టీఆర్ఎస్ వ‌ర్గాల‌కు షాక్ వంటిద‌ని అంటున్నారు. జాతీయ రాజ‌కీయాల ప‌రంప‌ర‌లో ఎదురైన ఈ తొలి ఎదురుదెబ్బ‌కు కేసీఆర్ ఆండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.
Tags:    

Similar News