మహారాష్ట్ర సీఎం మళ్లీ మనసు దోచుకున్నారు

Update: 2016-05-14 06:20 GMT
ముఖ్యమంత్రి హోదా ఉన్నా..సాదాసీదాగా వ్యవహరించటం.. తానేదో ప్రత్యేకం అన్నట్లు కాకుండా సగటుజీవి మాదిరిగా ప్రవర్తిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఆసక్తికరంగా మారింది. సామాజిక రుగ్మతల పట్ల రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేయటం.. వ్యవస్థ మారాలంటూ స్పీచులు ఇవ్వటమే కానీ.. తామే వాటిని తాము ఎందుకు మార్చకూడదన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. మిగిలిన వారికి భిన్నంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనదైన శైలిలో తీసుకున్న తాజా నిర్ణయం పలువురిని ఆకర్షిస్తోంది.

గ్రామాల్లో జరిగే పంచాయితీలు మామూలే. తమ కట్టుబాటుకు భిన్నంగా ఏదైనా ఘటన జరిగితే.. పంచాయితీ నిర్వహించి సంఘ బహిష్కరణ శిక్షల్ని విధించటం మామూలే. ఇలాంటి వాటి విషయంలో ఇప్పటివరకూ ఏ నేత చేయని పనిని దేవేంద్ర ఫడ్నవిస్ చేశారు. అలాంటి సంఘ బహిష్కరణ శిక్షలు విధించటాన్ని నేరంగా పేర్కొంటూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పంచాయితీలు విధించే సంఘ బహిష్కరణ విషయంలో తమ సర్కారు కఠినంగా ఉండటమే కాదు.. ఇలాంటివి చోటు చేసుకుంటే.. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయటమే కాదు.. అలాంటి తప్పు చేసినట్లు రుజువైతే ఏడేళ్లు జైలుశిక్ష లేదంటే రూ.5లక్షల జరిమానా.. అవసరమైతే ఈ రెండు శిక్షల్ని కలిపి విధించాలంటూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలోని ఏ రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకోలేదు. ఉత్తరాదిన ఇలాంటి సంఘ బహిష్కరణలు దళితుల మీద ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవటానికి వీలుగా ఫడ్నవిస్ తీసుకొచ్చిన చట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో కావటం మంచిది.
Tags:    

Similar News