అర్ధరాత్రి నోటీసులు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు... మీడియాకు అర్దరాత్రి నోటీసులు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధిస్తోంది అంటూ టీ న్యూస్ చానల్ కు నోటీసులు ఇచ్చిన వెలువడిన ఆగ్రహాల్లో నిజానిజాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టీ న్యూస్ కు నోటీసులపై టీఆర్ఎస్ శ్రేణులు దీనిపై రోడ్లెక్కాయి. దాదాపు అన్ని జర్నలిస్టు సంఘాలు పత్రికా స్వేచ్ఛ పై దాడి అంటూ నిరసనలు చేశాయి. కానీ ఇంతకీ జరిగిందేంటి? నిజంగానే ఏ సమాచారం లేకుండా అర్దరాత్రి నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఏపీ పోలీసులు...అలా చేసేందుకు భయపడిపోయి రాత్రివరకు వెయిట్ చేసి అపుడు నోటీసులు ఇచ్చారా? టీ న్యూస్ అబద్దాలు చెప్పిందా? అనే సందేహాలను ఏపీ పోలీసులు నివృత్తి చేసినట్లు సమాచారం.
కొన్ని రోజులుగా పర్యటనల్లో ఉన్న ఏపీ డీజీపీ జేవీ రాముడు హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులతో తాజాగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని టీ-న్యూస్ చానల్‌కు విశాఖ పోలీసులు అర్ధరాత్రి ఇచ్చిన నోటీసులపై పోలీసు అధికారులతో రాముడు చర్చించారు. ఈ విషయంలో నిజానిజాలు ఏంటని ఆరాతీశారని సమాచారం. ఈ సందర్భంగా సదరు ఉన్నతాధికారులు అసలు నిజం చెప్పారని తెలిసింది.
టీన్యూస్ చానల్ కు నోటీసులు ఇచ్చేందుకు తాము అదే రోజు సాయంత్రమే సదరు కార్యాలయానికి వెళ్లామని విశాఖ రేంజ్ పోలీసు అధికారులు డీజీపీకి తెలిపారు. అయితే తమ సీఈఓ వస్తేనే నోటీసులు తీసుకుంటామని చెప్పి....ఆ తర్వాత ఇదిగో అదిగో అంటూ రాత్రి 11 గంటల వరకూ గడిపారని సదరు అధికారులు వివరించారు. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తాము వచ్చామనడంలో కూడా వాస్తవం లేదని పోలీసులు డీజీపీ వెల్లడించినట్లు సమాచారం. టీ న్యూస్ కు నోటీసులు ఇచ్చే రోజు ఉదయమే తాము హైదరాబాద్ పోలీసులకు ఈ విషయం తెలియజేశామని సదరు అధికారులు డీజీపీతో స్పష్టం చేసినట్లు సమాచారం.