ఫలితాలు వచ్చాక కూడా ఇవేం మాటలు ధర్మాన!

Update: 2023-03-26 18:00 GMT
కొందరు నేతలు కొన్నింటిని అస్సలు పట్టించుకోరు. తమ ధోరణిలోనే తాము ఉంటారు. తమ మాటలతో పార్టీకి చేటు చేస్తాయన్న సోయి కూడా లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు అదే రీతిలో ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటిలోనూ అధికార పార్టీ దారుణమైన ఓటమిని ఎదుర్కోవటం.. ఆ మూడింటిలో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ సీటు ఉండటం తెలిసిందే.

పట్టభద్రుల తీర్పును చూసిన తర్వాతైనా తన మాటల్ని కాస్తంత మార్చుకోవాల్సిన అవసరాన్ని ధర్మాన మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.  తాజాగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ అసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు జగన్ సర్కారు మాదిరి పథకాలు ఇవ్వలేకపోయాయని.. అందుకే జగన్ కు మరోసారిఓటు వేయాలన్నారు.

ఈ మాట వరకు ధర్మానను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తమ ప్రభుత్వం గురించి.. తాను విధేయుడిగా ఉన్న ముఖ్యమంత్రి గురించి ఆ మాత్రం గొప్పలు చెప్పుకోపోతే బాగుండదు. కానీ.. ఆ తర్వాత చెప్పిన మాటతోనే అభ్యంతరమంతా. జగన్ కు ఓటు వేయకపోతే.. అక్కచెల్లమ్మలకు సహాయం చేయటం అనవసరమే భావన సమాజంలోకి వెళుతుందని వ్యాఖ్యానించటంతోనే పంచాయితీ అంతా.

అంటే.. జగన్ ప్రభుత్వం అయితేనే పథకాలు.. డబ్బులు ఇస్తారు కానీ మిగిలిన వారెవరూ ఇవ్వరన్నట్లుగా వ్యాఖ్యానించటం వల్ల నష్టమే తప్పించి లాభం ఉండదంటున్నారు. గత ఎన్నికలకుముందు చంద్రబాబు ఇదే అక్కచెల్లెల్లకు పసుపుకుంకుమ పేరుతోభారీగా నగదు బ్యాంకుల్లో వేస్తే.. జరిగిందేమిటి? చంద్రబాబుకు ఓటు వేయకుండా జగన్ కు వేశారు కదా?

చంద్రబాబుకు ఓటు వేయలేదు కాబట్టి.. డబ్బులు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నట్లుగా జగన్ ఫీల్ కాలేదే? తాను ఇవ్వాల్సినవి ఇస్తూ వస్తున్నారు. అలానే. ఎవరైనా సరే.. కొన్ని వర్గాలకు అందించాల్సిన సాయాన్ని అందించేందుకే ఇష్టపడతాయి.

ఎందుకంటే.. ప్రజల్ని .. వారి సమస్యల్ని.. వారి పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కన్నా.. వారు అలా పేదరికంలో ఉండిపోతేనే తమకు ఎప్పటికి విధేయులుగా ఉంటారని భావిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ధర్మాన లాంటి నేతకు.. ప్రజల మైండ్ సెట్ తెలీకుండా ఉండటమా? ప్రజలను డబ్బుల బూచి చూపించి బెదిరిస్తేనో.. భావోద్వేగానికి గురి చేస్తేనో ఓట్లు పడవన్న వాస్తవాన్ని ఆయన ఎప్పటికి గుర్తిస్తారో?

Similar News