మరో వివాదంలో ధోని

Update: 2019-07-25 14:28 GMT
మరో వివాదంలో ధోని
  • whatsapp icon
రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌ మెంట్‌.. ధోని ఆప్త మిత్రుడు అరుణ్ పాండే నడిపించే ఈ సంస్థ పలు వివాదాలతో ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఈ సంస్థలో ధోనికి కూడా భాగస్వామ్యం ఉందన్నది బహిరంగ రహస్యం. తాజాగా ఈ సంస్థను మరో వివాదం చుట్టు ముట్టింది. చెప్పిన సమయానికి ఫ్లాట్లు అప్పగించకుండా వేలమంది కొనుగోలుదార్లను ఇబ్బంది పెడుతున్న ఆమ్రపాలి గ్రూప్‌ రిజిస్ట్రేషన్‌ ను రెరా చట్టం కింద సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకు ఒకప్పుడు ధోని ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన విషయం ఏంటంటే.. రితి స్పోర్ట్స్ మేనేజ్ మెంట్‌ తో ఆమ్రపాలి సంస్థ గృహ కొనుగోలుదార్లకు చెందిన డబ్బును చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించడం కోసం చీకటి ఒప్పందాలు చేసుకుందట.

రితి - ఆమ్రపాలి ఒప్పందాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు పవన్ కుమార్ అగర్వాల్ - రవీందర్ భాటియా సమర్పించిన ఫోరెన్సిక్‌ ఆడిట్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను సుప్రీం కోర్టు అంగీకరించింది. 2009-2015 మధ్య రితి సంస్థకు ఆమ్రపాలి రూ.42.22 కోట్లు చెల్లించినట్లు కోర్టుకు తెలిపింది. ధోనికి రితిలో వాటా ఉండటమే కాదు - అతడి భార్య సాక్షి ఆ సంస్థకు కొంతకాలం డైరెక్టర్‌ గా కూడా పని చేసింది. ఆమ్రపాలికి ప్రచారకర్తగా కూడా వ్యవహరించిన ధోని.. గ్రూప్ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి చాలా లావాదేవీలను నిర్వహించారని - ఇతర గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా ధోని జోక్యం చేసుకున్నాడని తమ ఆడిట్ రిపోర్టులో పవన్ కుమార్ అగర్వాల్ - రవీందర్ భాటియా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ధోని ఏమని స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News