ధోని బిడ్డ పసిపాపపై ఏంటీ నీచపు బెదిరింపులు?

Update: 2020-10-10 06:15 GMT
సభ్య సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఆటను ఆటగా చూసే వాళ్లు లేకుండా పోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వైఫల్యానికి ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కారణంగా కొందరు దుష్టులైన అభిమానులు రగిలిపోయి ఆయన కుమార్తెపై  బెదిరింపులకు పాల్పడడం దారుణంగా ఉంది.

మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని ఐదేళ్ల కుమార్తెకు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఆ పసిపాపను అత్యాచారం చేస్తామంటూ దుర్మార్గులు బెదిరింపులు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది.

కోల్ కతా విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై జట్టు విఫలమైంది,  10 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ ఓటమి ఎదురుకాగానే ధోని దారుణంగా ఫెయిల్ అయ్యాడంటూ ఆయన భార్య సాక్షికి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బెదిరింపులు వచ్చాయి. ధోని కూతురును రేప్ చేస్తామంటూ కొందరు ఆకతాయిలు బెదరించడం సంచలనమైంది. ఈ బెదిరింపులపై మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యాయి.

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు నగ్మా ట్వీట్ చేస్తూ "మనం ఒక దేశంగా ఎక్కడికి వెళ్తున్నాం? ఇది అసహ్యంగా ఉంది, ధోని   5 సంవత్సరాల కుమార్తెపై అత్యాచార వేధింపులు చేస్తారా? క్రికెట్ లో ఓడిపోతే ఇంత దారుణానికి పాల్పడుతారా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మన దేశంలో ఇది ఏమి జరుగుతోంది? ? " అంటూ నగ్మా కడిగిపారేశారు.

కర్ణాటకలోని జయనగరానికి చెందిన ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి కూడా ట్వీట్ చేశారు. "ఇది దుర్మార్గం.. మన దేశానికి ఏమి జరుగుతోంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం?" అంటూ వాపోయారు.

రాజ్యసభ ఎంపి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేస్తూ, "సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనేదానికి ఇది చాలా అసహ్యకరమైన ఉదాహరణ.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో క్రికెట్ అంటే ప్రాణం. అదో మతంగా భావిస్తారు.  అభిమానులు తరచూ సరిగా ఆడని ఆటగాళ్ళపై తమ కోపాన్ని తీర్చుకుంటారు. ఓసారి వరల్డ్ కప్ లో విఫలమైన ఆటగాళ్ల ఇళ్లపై రాళ్ళు రువ్వారు. పోస్టర్లు తగలబెట్టారు.. నానా హంగామా చేశారు. కానీ ఈసారి దేశం గర్వించే ధోని లాంటి క్రీడాకారుడి కుమార్తెను ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడం దారుణంగా ఉంది. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు.
Tags:    

Similar News