మంత్రి కాకుండా ఆపలేరని సవాల్ చేశాడు

Update: 2017-04-15 09:31 GMT
తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుల్లో ఒకడైన ధూళిపాళ్ల నరేంద్రకు మొన్నటి మంత్రి వర్గ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. తన కుటుంబం ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ డైరీకి పోటీగా సంఘం డైరీని నడుపుతున్నాడన్న కారణంతోనే చంద్రబాబు.. నరేంద్రకు అవకాశం ఇవ్వలేదని వార్తలొచ్చాయి. దీనిపై నరేంద్ర స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్టాడుతూ.. ఇప్పుడు మంత్రి కాకుండా ఆపినప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం తాను మంత్రి అయి తీరుతానని చెప్పడం విశేషం.

మంత్రి పదవి దక్కనందుకు పార్టీ అధినేతపై తనకు కోపం ఏమీ లేదనీ.. కానీ ఆవేదన మాత్రం ఉందని అన్నారు నరేంద్ర. మంత్రి పదవి ఆశించడం తన ధర్మమనీ.. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అధినేత ఇష్టమని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ జరుగుతున్న ప్రతిసారీ తన గురించి ప్రత్యర్థులు మీడియా సమావేశాలు పెడుతుంటారని నరేంద్ర అన్నారు. తనకు కప్పదాటు రాజకీయాలు తెలియవని.. నేరుగా రాజకీయాలు చేస్తానని ఆయనన్నారు. సంఘం డెయిరీ వ్యవహారమే మంత్రి పదవి రాకపోవడానికి కారణమని తాను భావించడం లేదన్నారు. సంఘం డెయిరీ అనేది తన రక్తంలోనే ఉందని.. దాన్ని వెయ్యి కోట్ల టర్నోవర్ వచ్చే ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ తో ఎలాంటి పోటీ ఉండదన్నారు. వ్యాపారం వ్యాపారమేనని.. రాజకీయం రాజకీయమేనని చెప్పారు. ఇసుక దందాలకు సంబంధించి తమ్ముడు సురేంద్రపై ఆరోపణలు రావడంతో అతడిని రాజకీయాలకు దూరం పెట్టినట్లు నరేంద్ర చెప్పారు. మంత్రి కాకుండా ఇప్పుడు తనను ఆపగలిగారేమో కానీ.. భవిష్యత్తులో కచ్చితంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News