మోడీ అనుభవం నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదా?

Update: 2021-04-23 09:36 GMT
రాష్ట్రం పెద్దదే కావొచ్చు. అయితే మాత్రం.. 295 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల్ని ఎనిమిది దశల్లో  నిర్వహించాలన్న నిర్ణయం వెనుక బోలెడన్ని కారణాలే ఉండొచ్చు. కానీ.. ఈ రోజు దేశం ఇంతలా ఆగమాగం కావటానికి ముఖ్యకారణమని చెప్పక తప్పదు. బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవటం కోసం మోడీషాలు చేసిన ప్రయత్నాలు.. పెట్టిన ఫోకస్ దెబ్బకు కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నా పట్టించుకోని దుస్థితి. చివరకు.. పరిస్థితి దాదాపు చేయి దాటే వేళలో ఉలిక్కిపడిన ప్రధాని మోడీ.. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యల్ని చేపట్టారు.

కానీ.. ఇప్పటికే కరోనా బాధితులు పలువురు పెద్ద ఎత్తున ప్రాణాల్ని కోల్పోయిన విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు లాంటివి అస్సలు సరికాదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి వేళలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాత్రం తెలంగాణలోని రెండుకార్పొరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల్ని నిర్వహిస్తామని ప్రకటించటం షాకింగ్ గా మారింది. ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరికి వారు ఇళ్లల్లో కూర్చొని.. ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఉండటం మంచిదన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా మున్సిపోల్స్ కు కేసీఆర్ సర్కారు సానుకూలతను ప్రదర్శించటం గమనార్హం.

కోవిడ్ కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న వేళ.. ఎన్నికల్ని నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లుగా పార్థసారధి స్పష్టం చేశారు. అన్ని రకాల ముందుజాగ్రత్తల్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఆయన ఓపెన్ అయ్యారు. ర్యాలీల్ని రాత్రి 7నుంచి ఉదయం 8 గంటల వరకు నిషేధించామని.. బహిరంగ సభలపైనా పరిమితులు ఉన్నట్లు చెప్పారు.

ఓపక్క కేసులు సంఖ్య భారీగాపెరిగే వేళలో.. ఇన్ని అవస్థలు పడుతూ ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఉందా? ఓపక్క పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల విషయంలో మోడీ ప్రదర్శించిన అటెక్షన్ ఈ రోజున దేశంలో కేసులు పెరగటానికి.. తాజా పరిస్థితులకు కారణమని చెప్పక తప్పదు. దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న మోడీ బాటలోనే కేసీఆర్ నడవాలని అనుకోవటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న? మోడీకి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితి నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకోకపోవటం ఏమిటి?
Tags:    

Similar News