ఉత్తరాంధ్ర బాద్యతలు తీసుకున్నారా ?

Update: 2022-06-02 03:33 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగుబాబు ఉత్తరాంధ్రకు ఇన్చార్జి బాద్యతలు తీసుకున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలో పవన్ తర్వాత కీలకనేత ఎవరంటే నాదెండ్ల మనోహర్ పేరు మాత్రమే వినిపిస్తుంది.

ఎందుకంటే పార్టీకి రాష్ట్రకమిటి కానీ ప్రాంతాలవారీగా ఇన్చార్జిలను  కానీ ఎవరినీ పవన్ నియమించలేదు. అయితే హఠాత్తుగా నాగుబాబు జూన్ 1వ తేదీ నుండి ఉత్తరాంధ్రలో పర్యటన మొదలుపెట్టారు.

దీనిబట్టి చూస్తుంటే నాగుబాబును ఉత్తరాంధ్రకు ఇన్చార్జిగా నియమించారని అందరు అనుకుంటున్నారు. నాగుబాబునే ఎందుకు నియమించారంటే వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని ఏదో ఒక పార్లమెంటు సీటునుండి పోటీచేయటానికి నాగుబాబు ఆసక్తిగా ఉన్నారట. మొన్నటి ఎన్నికల్లో ఈయన నరసరావుపేట పార్లమెంటుకు పోటీచేసిన విషయం తెలిసిందే. ముక్కోణపు పోటీలో అప్పట్లో నాగుబాబుకు సుమారు 2.5 లక్షల ఓట్లొచ్చాయి.

వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడినుండే పోటీచేయాలని అనుకున్నారు. కాకపోతే ఇదే సీటులో వైసీపీ తరపున గెలిచిన తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కన్నేసినట్లు ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా రఘురాజు రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారట. ఇక ఆయన్ను కాదనలేక సోదరుడినే వేరే సీటు చూసుకోమని చెప్పారట. అప్పుడు నాగుబాబు ఉత్తరాంధ్ర నుండి పోటీచేయటానికి నిర్ణయించుకున్నారట.

ఇందులో భాగంగానే విశాఖపట్నం లేదా అనకాపల్లి నియోజకవర్గాల మీద దృష్టిపెట్టారట. అందుకనే సోదరుడికి  ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారని పార్టీనేతలు  చెప్పుకుంటున్నారు. తన పర్యటనలో నాగుబాబు కూడా శ్రీకాకుళం జిల్లా నేతలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు మొదలుపెట్టారు.

విజయనగరం, వైజాగ్ జిల్లాలోని నియోజకవర్గాల నేతలతో వరుసగా భేటీలు పెట్టుకున్నారు. మెంబర్ షిప్పు చేయటం, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్ధితులను అంచనావేయటం, పార్టీలో చేరటానికి ఆసక్తిచూపుతున్నవారిని కలవటం లాంటి పనులతో నాగుబాబు బిజీగా ఉండబోతున్నారు. మొత్తానికి ఇంతకాలానికి నాగుబాబు పార్టీ కోసం క్షేత్రస్ధాయిలో పర్యటనలు పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.
Tags:    

Similar News