గంటాదేనా త‌ప్పు..అన్న చేసింది రైటా ప‌వ‌న్‌?

Update: 2018-10-01 13:01 GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాలు మిగ‌తా అంద‌రితో పోలిస్తే భ‌లే చిత్రంగా ఉంటాయి. ఆయ‌న నోటి నుంచి ఎపుడు ఎలాంటి మాట‌లు వ‌స్తాయో అస్సలు ఊహించ‌లేం. అత‌ను ప్ర‌క‌ట‌న‌ల‌తో ఒక‌దానికి ఒక‌దానికి పొంత‌న ఉండ‌దు. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ ఏదో మాట్లాడాల‌నుకుని ఇంకేదో మాట్లాడారు.

నా వెనుక టీనేజ‌ర్లు ఉన్నారు.. సీనియర్లు లేరు అన్న ఆరోప‌ణ‌ల‌పై ప‌వ‌న్ స్పందిస్తూ.. నా పార్టీకి అంద‌రి అండ ఉంది.. బాధ్య‌తలు మోసే నాయ‌కులు త‌ప్ప అవ‌కాశ‌వాదులు వ‌ద్దు.  పార్టీ న‌డిచేది అనుభ‌వం ఉన్న‌ సీనియ‌ర్ల‌తోనూ - మ‌మ్మ‌ల్ని ఆద‌రించే యువ‌శ‌క్తితోనూ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే, ఆయ‌న మాటల్లో సీనియ‌ర్ల‌ను న‌మ్ముకుంటే పార్టీ న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌నేది ప‌వ‌న్ ఫీల‌వుతున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. వారు ఎపుడు త‌న‌ను వ‌దిలి వెళ్ల‌పోతారో అన్న భ‌యంతో ఆయ‌న ఉన్న‌ట్టు అంద‌రికీ స్ఫ‌స్టంగా తెలుస్తోంది. తాజాగా ఒక బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్‌.... *ఒక ఎన్నిక‌ల‌కు వ‌చ్చి ఇంకో ఎన్నిక‌ల‌కు వ‌చ్చే నాయ‌క‌త్వం మాకొద్దు. ఇంట్లో తిరిగే గంటా శ్రీ‌నివాస‌రావు లాంటి వ్య‌క్తి కూడా ఆ పార్టీని క‌లిపేశాడు కాంగ్రెస్ లోకి* అంటూ పీఆర్పీ విలీనం నింద‌ను గంటాపై వేసేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

అవును... ఆయ‌న ఒక రాజ‌కీయ నాయ‌కుడు. త‌న గురించి తాను ఆలోచించుకున్నాడు. అత‌నేమీ అధ్యక్షుడు కాదు. మ‌రి గంటా చెబితే చిరంజీవి ఎందుకు కాంగ్రెస్‌ లో క‌ల‌పాలి? ఈ ప్రాథ‌మిక ప్ర‌శ్న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌దిలేశాడు. స‌ల‌హాలు ఇచ్చేవాళ్లు వంద ఇస్తారు. అంత మాత్రాన వాటిని ఫాలో అవుతారా? కేవ‌లం పార్టీ ఎమ్మెల్యే అయిన గంటా పార్టీ విలీనాన్ని నిర్దేశిస్తే చిరంజీవి ఎందుకు ఒప్పుకున్నాడు. అంటే త‌న అన్న కూడా బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తించిన‌ట్లే క‌దా. మ‌రి  ప‌వ‌న్ చిరంజీవిని ఎందుకు ప్ర‌స్తావించరు? ఆయ‌న కూడా ఒక  ఎన్నిక‌కు వ‌చ్చి వెళ్లిపోయిన వ్య‌క్తే క‌దా. మ‌ళ్లీ ప్ర‌త్యక్ష  ఎన్నిక‌ల‌కు రానేలేదు. ఇక‌నైనా వ‌స్తారో లేదో తెలియ‌దు. మ‌రి జ‌నం ఎంతో న‌మ్మితేనే క‌దా.. 18 సీట్లు - పాతిక శాతం ఓట్లు ఇచ్చింది. మ‌రి వారి గురించి ప‌ట్టించుకోకుండా న‌డి సంద్రంలో నావ‌ను వ‌దిలేసిన చిరంజీవిని ప‌వ‌న్ ఏమీ అన‌కుండా ఉంటే.. చిరంజీవి చేసిన త‌ప్పు ఒప్ప‌వుతుందా?  లేక తాను చెప్ప‌క‌పోతే జ‌నానికి గుర్తురాదు అనుకుంటున్నారా?

ఇదిలా ఉంటే... ఇదే మీటింగ్‌ లో ప‌వ‌న్ త‌న అజ్ఞానాన్ని మ‌రోసారి  ప్ర‌ద‌ర్శించారు. 2009లో రాత్రికిరాత్రి 283 సీట్ల‌లో పోటీ చేసే స‌త్తా ఉన్న‌వాళ్లం మ‌నం అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అస‌లు అప్ప‌టి నియోజ‌క‌వ‌ర్గాలు 294 ప‌వ‌న్‌... 283 కాదు. మ‌రో విష‌యం.. మ‌రి అన్ని స్థానాల్లో  పోటీ చేసే స‌త్తా ఉన్న ప‌వ‌న్ అన్న‌ను ఎందుకు గెలిపించ‌లేక‌పోయారా అని అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తంచేస్తున్నారు. పైగా ఆయ‌న అప్ప‌ట్లో ఉదృతంగా ప్ర‌చారం కూడా చేశారు. ఏమిటో ఈ ప‌వ‌నం పేరుకు త‌గ్గ‌ట్టు అన్నీ గాలివాటంగా మాట్లాడేస్తుంటారు.


Tags:    

Similar News