ఎంపీ సర్వేలో జగన్ గ్రాఫ్ పెరిగినట్లేనా ?

Update: 2021-09-28 04:33 GMT
‘జగన్మోహన్ రెడ్డి అనాలోచిత ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పరిపాలనా గ్రాఫ్ పడిపోతోంది’ ఇది తాజాగా ఢిల్లీలో కూర్చుని వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు. జగన్ పరిపాలనపై తాను తాజాగా ఓ సర్వే నిర్వహించారట. ఈ సర్వేలో జగన్ గ్రాఫ్ 15 శాతం తగ్గిపోయినట్లు స్పష్టంగా బయటపడిందట.

తాను ఎవరితో సర్వే చేయించారు, ఎన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించారనే విషయాన్ని ఎంపీ బయటపెట్టలేదు. సరే సర్వే చేయించిందే నిజమనుకుందాం. తాను ఆ మధ్య కూడా ఓ సర్వే చేయించినట్లు ఆయనే చెప్పుకున్నారు. నర్సాపురంలో 9 లక్షల మందితో ఐవీఆర్ఎఫ్ పద్దతిలో మొబైల్ ద్వారా ఒక సర్వే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో సర్వే చేయించినట్లు చెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో తనతో పోటీ చేస్తే జగన్ కూడా ఓడిపోతారని చెప్పుకుని సంబరపడిపోయారు.

అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిపించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లకన్నా వచ్చే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ సర్వే వివరాలు చెప్పి ఇంకా నెల కూడా కాలేదు. తాజాగా చేయించిన సర్వేలో 15 శాతం జగన్ గ్రాఫ్ తగ్గిపోయిందని ఇపుడు చెప్పారు. శాతం గురించి చెప్పారు కాబట్టి 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం 49.95 అంటే 50 శాతం అనుకోవచ్చు.

అప్పుడు వచ్చిన 50 శాతం ఓట్లలో నుండి తాజాగా తగ్గిన జగన్ గ్రాఫ్ 15 శాతం తీసేస్తే ఇంకా నికరంగా జగన్ కు మద్దతుగా 35 శాతం ప్రజలు ఉన్నట్లే లెక్కకదా.  35 శాతం ప్రజలు జగన్ కు మద్దతు ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్న పార్టీపై అనేక కారణాల వల్ల జనాల్లో వ్యతిరేకత కనబడటం సహజమే. తమ ఆలోచనలకు ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయటం లేదని భావించిన ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది.

అంటే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతున్నా జగన్ పాలనపై ఎంపి చేయించిన సర్వే ప్రకారం 35 శాతం జనాలు సంతృప్తిగా ఉండటమంటే మామూలు విషయం కాదు. ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతున్న విషయం ఏమిటంటే తాజా సర్వే ప్రకారం గతంలో ఎంపి ప్రకటించిన సర్వే ఆధారంగా జగన్ గ్రాఫ్ పెరుగుతోందని అర్ధమవుతోంది. జగన్ గ్రాఫ్ తగ్గిందని ఎంపి అన్నారు కానీ ఆయన లెక్క ప్రకారం పెరిగిందనే అనుకోవాలి. ఎలాగంటే  50 సీట్లకన్నా వైసీపీకి రాదని గత సర్వేలో తేలిన దగ్గర నుండి 35 శాతం  ప్రజలు మద్దుతిస్తున్నారనే తాజా సర్వే చూస్తే  జగన్ గ్రాఫ్ చాలా బాగా పెరిగినట్లే లెక్క.
Tags:    

Similar News