మన్ కీ బాత్ కాదు.. మనోవేదన బాత్

Update: 2021-01-31 14:30 GMT
అంతర్జాతీయంగా సంచలనంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో..కొందరు ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి బదులు మరో పతాకాన్ని ఎగురవేసిన వైనం తెలిసిందే. దీనిపై పులువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆవేదనను వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం.. జనవరి 26న ఎర్రకోట దగ్గర జరిగిన పరిణామాలపై ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంత తీవ్రమైన పరిణామం జరిగినప్పటికి పెదవి విప్పని ప్రధాని మోడీ.. ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత తన మన్ కీ బాత్ కార్యక్రమంలో పెదవి విప్పారు.

ప్రతి నెలా చివరి వారంలో మన్ కీ బాత్ పేరుతో పలు అంశాల్ని ప్రస్తావించే ప్రధాని మోడీ.. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్.. మోడీ మనోవేదన బాత్ గా మారిందని చెప్పాలి. ఎర్రకోట వద్ద ఇతర జెండాలపై ఆవేదనను వ్యక్తం చేసిన ఆయన.. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతావని దు:ఖించిందన్నారు.

ప్రపంచంలోఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ప్రజలకు టీకా అందజేస్తున్న వైనాన్ని ప్రస్తావించారు. కేవలం 15 రోజుల్లో 30 లక్షల మందికి టీకా అందించిన విషయాన్ని గుర్తు చేసి.. సంపన్నదేశమైన అమెరికాలోనూ 30 లక్షల డోసుల్ని అందించటానికి 18 రోజులు పడితే.. బ్రిటన్ లో 36 రోజులు పట్టిందన్నారు. కరోనాపై భారత్ చేస్తున్న యుద్ధం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కోవిడ్ టీకా తయారీ సామర్థ్యాన్నిభారత్ ప్రపంచానికి చాటిందన్న ఆయన.. సరైన సమయంలో టీకా అందించి ఆదుకున్నందుకు ప్రపంచ దేశాలు భారత్ పై ప్రశంసలు కురిపిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.

క్రికెట్ లో టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని మోడీ ప్రస్తావించారు. ఇలాంటి ఉత్సాహ భరిత వాతావరణంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటన అందరిని బాధించిందన్నారు. పద్మ పురస్కారాల్ని సొంతం చేసుకున్న వారిని అభినందించిన ఆయన.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పలువురు చేస్తున్న ప్రయత్నాల్ని ప్రస్తావించారు.


Tags:    

Similar News