డిజిటల్‌ ఇండియా .. అందరికి డిజిటల్ హెల్త్ ఐడీ కార్డ్

Update: 2021-09-29 00:30 GMT
భారత పౌరులకు ఆధార్ కార్డ్ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ విభిన్న ఆధార్ నెంబర్  ఉంటుంది. ఒక ఆధార్ నెంబర్ లాగా మరో ఆధార్ నెంబర్ ఉండదు. ఇప్పుడు అలాంటి మరో కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను లాంఛ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన  మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్   పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీని అందించే ప్రత్యేక కార్యక్రమం ఇది. ఆధార్ నెంబర్ లాగానే ప్రతీ ఒక్కరికీ భిన్నమైన డిజిటల్ హెల్త్ ఐడీ ఉంటుంది.

ఈ ఐడీలో హెల్త్ రికార్డ్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. నేషనల్ హెల్త్ అథారిటీ కలిసి ఈ మిషన్ పనిచేస్తుంది. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పైలట్ పద్ధతిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఒక లక్షకు పైగా యూనిక్ హెల్త్ ఐడీలను క్రియేట్ చేశారు. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ యూనిక్ ఐడీలో 14 అంకెలు ఉంటాయి. పౌరులందరికీ త్వరలో ఈ ఐడీలు వస్తాయి. ఇది వ్యక్తిగత హెల్త్ అకౌంట్ లాంటిది. ఇందులో సదరు వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారం మొత్తం ఉంటుంది. దీర్ఘకాలం పాటు హెల్త్ రికార్డ్స్ స్టోర్ చేయడానికి, ఎవరితోనైనా షేర్ చేయడానికి ఈ హెల్త్ ఐడీ ఉపయోగపడుతుంది.

హెల్త్ అకౌంట్‌లో సదరు వ్యక్తి కన్సల్ట్ అయిన ప్రతీ డాక్టర్ వివరాలు ఉంటాయి. వారికి ఉన్న వ్యాధుల సమాచారం, చేయించుకున్న టెస్టుల వివరాలు ఉంటాయి. ఇతర డాక్టర్ల దగ్గరకు వెళ్లినప్పుడు డిజిటల్ హెల్త్ ఐడీ ఇస్తే చాలు... ఆ ఆస్పత్రి సిబ్బందికి పేషెంట్ ఆరోగ్య చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఆరోగ్య చరిత్రతో పాటు వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ కూడా హెల్త్ ఐడీలో ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ ద్వారా పర్సనల్ హెల్త్ రికార్డ్స్ యాక్సెస్ చేయొచ్చు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా పౌరులు ఎవరైనా హెల్త్ ఐడీని ఉచితంగా పొందొచ్చు. హెల్త్ ఐడీ పొందడం ఉచితం. హెల్త్ ఐడీ పొందడం తప్పనిసరి కాదు. స్వచ్ఛందం మాత్రమే. త్వరలో అన్ని రాష్ట్రాల్లోని పౌరులు హెల్త్ ఐడీ తీసుకోవచ్చు.

పేదలు, మధ్యతరగతి ప్రజలకు వైద్యచికిత్స అందించడంలోని ప్రతిబంధనాలను తొలగించడంలో మిషన్‌ క్రియాశీల పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ తొలి జయంతి నాడు ఆయుష్మాన్‌ భారత్‌ యోజనను ప్రారంభించగా, ఆయన మూడో జయంతి నాడు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉన్నదన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ అందుబాటులో లేనివిధంగా భారతీయులకు డిజిటల్‌ మౌలిక సదుపాయాలు అందుతున్నాయని మోదీ వివరించారు. 130 కోట్ల ఆధార్‌ కార్డులు, 118 కోట్ల మొబైల్‌ వినియోగదారులు, 80 కోట్ల ఇంటర్నెట్‌ వాడకందార్లు, 43 కోట్ల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, ఇలా ఇంత పెద్ద సంఖ్యలో డిజిటల్‌ అనుసంధాన సేవలు ప్రపంచంలో మరెక్కడా చూడలేమని వ్యాఖ్యానించారు.

పాలన నుంచి రేషన్‌ కార్డుల వరకు ప్రతి డిజిటల్‌ సేవా పారదర్శకంగా ప్రతి భారతీయుడికీ అందుతోందని ప్రధాని తెలిపారు. దేశం కోసం నూతన పార్లమెంటును సిద్ధం చేస్తున్న శ్రామికుల సేవలను గుర్తించుకునేలా డిజిటల్‌ ఆర్కైవ్స్‌ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నదన్నారు. కాగా, ప్రధానమంత్రి 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దిన ప్రసంగం చేస్తూ  ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పై ప్రకటన చేశారు. తొలుత ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ మిషన్‌ను అమలుచేసి, ఫలితాలను పరిశీలించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ఆరోగ్య యోజన పథకం ప్రారంభమై మూడేళ్లయిన సందర్భంగా ఇప్పుడిక దేశవ్యాప్తంగా మిషన్‌ ను లాంఛనంగా అమల్లోకి తెచ్చారు.
Tags:    

Similar News