ఇక ఆలయాల్లోనూ డిజిటల్‌ ఇండియా!

Update: 2022-11-18 15:30 GMT
పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ నోట్లతో కరోనా వస్తుందన్న భయాలతో ఇండియాలో డిజిటల్‌ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మారుమూల పల్లెటూళ్లలో తోపుడు బండిపైన కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర కూడా ఫోన్‌ పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే వంటివి దర్శనమిస్తున్నాయి. ఒక మామూలు బడ్డీకొట్ల నుంచి బహుళ అంతస్తుల షాపింగ్‌ మాల్స్‌ వరకు అన్ని చోట్లా డిజిటల్‌ పేమెంట్సే జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక దేవాలయాల్లోనూ డిజిటల్‌ ఇండియా ప్రవేశించింది. ఇప్పటివరకు నగదు రూపంలోనే దేవాలయాల్లో భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నారు. ఇక నుంచి అక్కడ కూడా ఫోన్‌ పే/గూగుల్‌ పే/వాట్సాప్‌ పే/అమెజాన్‌ పే/పేటీఎం ఇలా డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు.

ఈ సదుపాయం ప్రస్తుతం తెలంగాణలోని కొన్ని దేవాలయాల్లో అమల్లోకి వచ్చింది. ఆ దేవాలయాల్లో ఈ మేరకు క్యూఆర్‌ కోడ్లు ఏర్పాటు చేశారు. వీటిని స్కాన్‌ చేసి భక్తులు విరాళాలు ఇవ్వవచ్చు. ఇక దీంతో సకాలంలో నగదు చేతిలో లేదని బాధ ఉండదు.

ఇన్నాళ్లు నగదు రూపంలోనే విరాళాలు తీసుకుంటూ ఉండటం, సకాలంలో నగదు రూపంలో భారీ మొత్తం భక్తుల వద్ద లేకపోవడం తదితర కారణాలతో భక్తులకు విరాళాలు ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోయేవారు.

ఇప్పుడు డిజిటల్‌ చెల్లింపులను దేవాలయాల్లో ప్రవేశపెట్టడంతో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి విరాళాలు చెల్లించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి దేవాలయం, సిద్ధిపేట జిల్లా నాచారంగుట్ట నాచగరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, మేడారంలోని శ్రీ సమ్మక్క, సారలమ్మ దేవాలయాల్లో ఈ–హుండీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ దేవాలయాల్లో క్యూఆర్‌ కోడ్‌లను పెట్టారు. ఈ దేవాలయాలకు వచ్చే భక్తులు ఎవరైనా సరే విరాళాలు ఇవ్వాలనుకుంటే ఆ క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి డిజిటల్‌ విరాళాలు ఇవ్వవచ్చు.

ఈ దేవాలయాల్లో విజయవంతమైతే ఇక నిదానంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలన్నింటిలో ఈ–హుండీలను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సాధారణ చెల్లింపులతో పోలిస్తే డిజిటల్‌ చెల్లింపులతో లాభాలు కూడా ఉన్నాయంటున్నారు. నగదు రూపంలో చెల్లిస్తే వాటిని ప్రతిరోజూ లెక్క వేయడం, ఇందుకు భారీగా సిబ్బంది అవసరం, లెక్కించేటప్పుడు సిబ్బంది చేతివాటం, చెల్లని నోట్లు వేయడం ఇలా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదే డిజిటల్‌ పేమెంట్స్‌ అయితే వాటిని లెక్కించడానికి ప్రత్యేకంగా పరకామణి సిబ్బంది అవసరం ఉండదు. లెక్క కూడా పక్కాగా ఉంటుందని అంటున్నారు.

మరోవైపు దేవాలయాల్లోకి ఫోన్లను అనుమతించని విషయం తెలిసిందే. మరి భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఫోన్‌ తప్పనిసరి. ఫోన్‌ లేకుండా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయలేం. మరి ఫోన్ల విషయంలో దేవాలయాల అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News