ట్విట్ట‌ర్లో.. డిగ్గీ రాజా వ‌ర్సెస్ కేటీఆర్

Update: 2017-05-01 07:05 GMT
సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడైన డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజ‌య్ సింగ్‌. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియాకు చెందిన ట్విట్ట‌ర్ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై దిగ్విజ‌య్ సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌టం.. దీనికి ప్ర‌తిగా కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ కావ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. తెలంగాణ పోలీసులు న‌కిలీ ఐసిస్ వెబ్ సైట్ త‌యారు చేసి ముస్లిం యువ‌త‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని.. యువ‌త‌ను రెచ్చ‌గొట్టాల‌ని పోలీసుల‌కు కేసీఆర్ ప‌వ‌ర్ ఇచ్చారా? అని సూటిగా ప్ర‌శ్నించారు.

ఈ ఉదంతానికి సంబంధించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నైతిక బాధ్య‌త వ‌హించి.. త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ దిగ్విజ‌య్ సింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులు అనుస‌రించిన వైనం స‌మంజ‌స‌మైన‌దేనా? అంటూ ప్ర‌శ్నిస్తూ.. తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ దిగ్విజ‌య్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింది. డిగ్గీ ట్వీట్ల‌పై రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్‌..అంతే ఘాటుగా స్పందించారు.

 దిగ్విజ‌య్ సింగ్ తీరును త‌ప్పు ప‌ట్టిన కేటీఆర్‌.. ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన వ్య‌క్తి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌టం త‌గ‌ద‌న్న ఆయ‌న‌.. దిగ్విజ‌య్ తాను చేసిన వ్యాఖ్య‌ల్ని భేష‌రుతుగా ఉప‌సంహ‌రించుకోవాల‌న్నారు. నేరాల రేటును త‌గ్గించిన పోలీసుల నైతిక‌త‌ను దెబ్బ తీసేలా దిగ్విజ‌య్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్న కేటీఆర్‌.. చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపాల్సిందిగా డిమాండ్ చేశారు. ఊహించ‌ని రీతిలో తెర మీద‌కు వ‌చ్చిన ఈ కొత్త ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక‌.. దిగ్విజ‌య్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. ఇలాంటి విధానాన్ని యూపీలో అనుస‌రించార‌ని.. ఐసిస్ ను కంట్రోల్ చేయ‌టం కాంగ్రెస్ వైఫ‌ల్యం చెందింద‌ని.. అలాంటిది ఎవ‌రైనా ప్ర‌య‌త్నం చేస్తే ఎందుకు అడ్డుకుంటారంటూ సోష‌ల్ మీడియాలో ప‌లువురు మండిప‌డ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు..దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్య‌లు బాధ్య‌తారాహిత్యంతో ఉన్నాయ‌ని.. ఆయ‌నేమైనా ఐసిస్ ఏజెంటా? అంటూ ప‌లువురు నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డ‌టం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News