దేశమంతా దిశ ఎఫెక్ట్.. ఎన్ని మార్పులు ఎంత వేగంగా మారుతున్నాయంటే?

Update: 2019-12-05 05:57 GMT
సంచలనంగా మారిన దిశ హత్యాచార ఉదంతంలో పోలీసుల వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చినప్పుడు సరిహద్దు పంచాయితీల్ని తెర మీదకు తీసుకురావటం.. నేరం జరగకుండా నిరోధించటంలో వైఫల్యం చోటు చేసుకోవటాన్ని పలువురు తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. దిశ ఉదంతంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని పోలీసులు మహిళల భద్రతకు సరికొత్త చర్యల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

హైదరాబాద్

హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో మహిళల భద్రత కోసం కొత్త కార్యక్రమాల్ని చేపట్టారు. యువతులు.. మహిళలకు అదనపు సేవలు అందించేందుకు తాము సిద్ధమని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. రాత్రి వేళల్లో మహిళలు నడిపే వాహనాల్లో పెట్రోల్ అయిపోయినా.. పంక్చర్ అయినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపించారు. అదే రీతిలో హైదరాబాద్.. సైబరాబాద్ పరిధిలోని పోలీసులు కూడా డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే స్పందించేలా సిద్ధం చేస్తున్నారు.

లూధియానా

రాత్రివేళల్లో ప్రయాణించే మహిళలకు అనువుగా ఉండేందుకు పంజాబ్ లోని లూదియానా పోలీసులు సరికొత్త సేవా కార్యక్రమాన్ని షురూ చేశారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మద్య కాలంలో మహిళలకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు వీలుగా ఫ్రీ ట్రావెల్ సర్వీసును నిర్వమిస్తున్నారు.

పోలీసులు పేర్కొన్న సమయంలో వాహనం దొరక్క ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తే చాలు.. పోలీసు అధికారులు, వాహనం వచ్చి వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం రెండు నెంబర్లను ప్రకటించారు.

బెంగళూరు

దిశ హత్యాచార ఉదంతంలో నిందితులు బాధితురాల్ని కాల్చేందుకు లూజ్ పెట్రోల్ ను తమతో తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అన్ని పెట్రోల్ బంకుల్లోనూ లూజ్ పెట్రోల్ ను అమ్మకుండా నోటీసులు జారీ చేశారు. బాటిళ్లు.. క్యాన్లతో వచ్చే వారికి లూజ్ పెట్రోల్.. డీజిల్ విక్రయించకూడదని నిర్ణయం కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఇందుకు భిన్నంగా వ్యవహరించిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కోల్‌కతా

ఈ మహానగరంలో పాఠశాలలు.. కాలేజీలు.. ఇతర ప్రాంతాలతో పాటు..నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమేరాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు వీలుగా కోల్ కతా పోలీసు కమిషనర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మహిళలు కాలకృత్యాల కోసం నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లినప్పుడు దుండగుల బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించిన వారు.. మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.
Tags:    

Similar News