నిన్న ఉద్యోగుల తొలగింపు.. నేడు సీఈవోల జీతాల తగ్గింపు!

Update: 2023-01-13 09:01 GMT
దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాలు, కోవిడ్‌ సృష్టించిన విలయ అనంతరం పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం తదితర కారణాలతో ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంగిట ఉందని ఆర్థిక నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలైన మెటా, ఫేస్‌ బుక్, సిస్కో, అమెజాన్, గూగుల్, ఓలా, బైజూస్, ట్విట్టర్‌ తదితర ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగుల తొలగింపు బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తద్వారా తమకు పడిపోయిన ఆదాయాన్ని ఉద్యోగుల తొలగింపు ద్వారా భర్తీ చేసుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి.

మరోవైపు ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా సీఈవోల జీతాలను తగ్గించే పనిలో కూడా ఆయా సంస్థలు ఉండటం విశేషం. ఇప్పటికే ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా రికార్డు సృష్టించిన యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ శాలరీని ఆ సంస్థ తగ్గించడానికి నిర్ణయించడం విశేషం.


పెట్టుబడిదారుల అభిప్రాయం మేరకు తన వేతనాన్ని సర్దుబాటు చేయమని కుక్‌ స్వయంగా అభ్యర్థించారని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలపడం గమనార్హం. దీంతో టిమ్‌ కుక్‌ వేతనం 40శాతం పైగా తగ్గించి 49 మిలియన్లకు యాపిల్‌ కుదిస్తోంది.

కాగా 2022లో కుక్‌ 99.4 మిలియన్ల మొత్తాన్ని శాలరీ రూపంలో తీసుకున్నారని సమాచారం. ఇందులో బేసిక్‌ శాలరీ కింద 3 మిలియన్ల డాలర్లు, సుమారు 83 మిలియన్లు స్టాక్‌ అవార్డ్‌లు, బోనస్‌లు ఉన్నాయని తెలుస్తోంది.  

తమ సీఈవో టిమ్‌ కుక్‌ వేతనంపై యాపిల్‌ సంస్థ సైతం స్పందించడం గమనార్హం. సంస్థ అసాధారణమైన పనితీరు, సీఈవో సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని ఫైలింగ్‌లో పేర్కొంది.

ఇక 2023 నుంచి కంపెనీ లక్ష్యం 75 శాతానికి చేరుకుంటేనే టిమ్‌ కుక్‌ కు షేర్లు ఇస్తారు. పనితీరు ఆధారంగా షేర్లను 75 శాతానికి పెంచుతారు. ఇప్పటికే గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కి సైతం గూగుల్‌ ఇలాగే చేసింది.

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింతమంది సీఈవోల వేతనాలను కంపెనీలు తగ్గిస్తాయని తెలుస్తోంది. బోనస్‌ లు, షేర్లు వంటివాటిని కంపెనీల ఆదాయం, పనితీరు ఆధారంగానే ఇస్తారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News