పెళ్లానికి విడాకులు ఇవ్వొచ్చు.. పిల్లలకు కాదు.. సుప్రీం కీలక వ్యాఖ్య

Update: 2021-08-18 04:30 GMT
విడాకుల కేసు విచారణ వేళ.. అనూహ్య వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. తాజాగాఒక విడాకుల కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. భార్యకు విడాకులు ఇవ్వటం ఓకే కానీ.. పిల్లలకు విడాకులు ఇవ్వలేరని భర్తకు స్పష్టం చేసింది. అంతేకాదు.. ఒప్పందంలో భాగంగా చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.

2019లో ఒక వ్యాపార దంపతులు విడిపోవటానికి నిర్ణయించారు. ఇందుకోసం వారు ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పిల్లల్ని భార్య చూసుకునేట్లు.. అందుకు రూ.నాలుగు కోట్ల రూపాయిల్ని పరిహారం కింద ఇవ్వాలన్న ఒప్పందం కుదిరింది. మాట అయితే అనుకున్నారు కానీ.. పరిహారం ఇచ్చే విషయాన్ని మాత్రం భర్త పట్టించుకోలేదు. దీంతో.. భార్యకోర్టును ఆశ్రయించింది. సెటిల్ మెంట్ గా అనుకున్న మొత్తాన్ని తనకు వెంటనే ఇప్పించాలన్న అభ్యర్థనను చేసింది.
దీనిపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. అధికరణ 142 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలతో ఒక వ్యక్తి.. ఆయన భార్యకు పరస్పర అంగీకారంతో విడాకుల్ని మంజూరు చేసినట్లు చెప్పిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్య చేసింది. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వటం కుదురుతుంది కానీ తన కారణంగా పుట్టిన పిల్లలకు విడాకులు ఇవ్వటం కుదరదని స్పష్టం చేసింది.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.4కోట్ల పరిహారాన్ని ఆరు వారాల వ్యవధిలో భార్యకు అందజేయాలని చెప్పింది. పిల్లల భవిష్యత్తు కోసం భార్యకు తగిన మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. పిల్లల బాధ్యత తండ్రికి కూడా ఉంటుందని.. అందువల్ల విడాకులు ఇచ్చినా పిల్లల భవితవ్యం కోసం భార్యకు తగిన మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. ఆభరణాల వ్యాపారం చేసే తన క్లయింట్ ఆర్థిక పరిస్థితి కరోనా కారణంగా దెబ్బ తిన్నదని.. దివలా తీసే స్థితిలో ఉన్నందున సెటిల్ మెంట్ గా ఒప్పుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని చేసుకున్న అభ్యర్థనను మన్నించిన కోర్టు వెంటనే రూ.కోటి పరిహారాన్ని ఇవ్వాలని.. మిగిలిన రూ.3 కోట్లను సెప్టెంబరు నెలాఖరు లోపు చెల్లించాలని ఆదేశించింది.


Tags:    

Similar News