డీఎల్ కొత్త ఇన్నింగ్స్ ఎవరితోనో ?

Update: 2021-10-16 05:41 GMT
డీఎల్ రవీంద్రారెడ్డి అనగానే చాలామందికి అవుట్ డేటెడ్ పాలిటీషియన్ అనే చెప్పుకుంటారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం మంత్రిపదవి చేపట్టిన డీఎల్ తర్వాత ఎంఎల్ఏగా కూడా ఎప్పుడూ గెలవలేదు. ఒకపుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రధాన మద్దతుదారుల్లో ఒకరిగా ఉన్న కాలంలో డీఎల్ కు బాగానే ప్రాధాన్యత ఉండేది. కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరుసార్లు గెలిచిన డీఎల్ ఒకసారి మంత్రి కూడా అయ్యారు.

2009లో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఈ మాజీ మంత్రికి తర్వాత ఏ పార్టీ తరపున టికెట్ కూడా దక్కలేదు. వరుసగా రెండు ఎన్నికలకు అంటే పదేళ్ళు పోటీకే దూరమైపోయిన డీఎల్ ఒక విధంగా అవుట్ డేడెట్ పొలిటీషియన్ గానే లెక్క. పైగా వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎంఎల్ఏ శెట్టిపల్లె రఘునాదరెడ్డిని కాదని ఈయనకు టికెట్ రాదు. అలాగే టీడీపీలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ ను కాదని చంద్రబాబునాయుడు కూడా డీఎల్ టికెట్ ఇచ్చే అవకాశం లేదు.

అంటే రెండు ప్రధాన పార్టీల్లో దేనినుండి కూడా డీఎల్ పోటీచేసే అవకాశం లేదు. ఇక మిగిలింది జనసేన, బీజేపీ మాత్రమే. ప్రస్తుతానికైతే ఈ రెండు పార్టీల బలమెంతో అందరికీ తెలిసిందే. కాబట్టి పై రెండు పార్టీల తరపున పోటీచేస్తే డిపాజిట్లు దక్కటం కూడా అనుమానమే. ఇలాంటి నేపధ్యంలోనే డీఎల్ తాజాగా మాట్లాడుతు 2024 ఎన్నికల్లో తాను పోటీచేయటం ఖాయమని ప్రకటించారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆరోపణలు, విమర్శలు కూడా ఎక్కుపెట్టారు.

ఒకపుడు డీఎల్ అంటే మైదుకూరు లోనే కాకుండా యావత్ జిల్లాలో కూడా మంచి గౌరవమే ఉండేది. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన కడప జిల్లాలో ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటారని డీఎల్ కు మంచిపేరే ఉంది. పైడా ప్రాక్టీస్ డాక్టర్ కూడా కావటంతో నియోజకవర్గంలో జనాదరణ కూడా ఉండేది.  కానీ అదంతా చరిత్రగా మారిపోయింది. మరిపుడు డీఎల్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది.

కొంతకాలం వైసీపీలో ఉన్నా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితో దూరమైపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన డీఎల్ ఏ పార్టీ తరపున అనేది మాత్రం చెప్పలేదు. బహుశా తన ప్రకటన చూడంగానే బీజేపీ, జనసేన తనను సంప్రదిస్తాయని అనుకున్నట్లున్నారు. ఏదేమైనా మంచి మనిషిగా పేరున్న డీఎల్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుదామని అనుకోవటం మంచిదే. మరి ఏ పార్టీ తరపున కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతారో చూడాల్సిందే.
Tags:    

Similar News