మన చిల్లరకొట్టు పెద్దాయనకు ప్రపంచ టాప్ 100 కుబేరుల్లో చోటు

Update: 2021-08-19 03:18 GMT
మనకు తెలిసిన చిల్లరకొట్లకు కాస్తంత రూపం మార్చి అన్ని సరకులు దొరికేలా.. అతి తక్కువ ధరకు అందుబాటు ఉండేలా ఏర్పాటు చేసిన డిమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సూపర్ మార్కెట్ వ్యాపారానికి సరికొత్త ఇమేజ్ ను తీసుకొస్తూ.. తక్కువ స్థలంలో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగేలా ప్లాన్ చేసిన ఆయన ఆలోచన ఇప్పుడాయన్ను టాప్ 100 ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కేలా చేసింది.

స్వతహాగా మంచి మదుపరి అయిన ఆయన.. అవెన్యూ సూపర్ మార్ట్స్ సంస్థకు వ్యవస్థాపకుడన్న విషయం తెలిసిందే. వీరి బ్రాండ్ ‘డి-మార్ట్’. ఈ పేరుతో పెద్ద ఎత్తున కిరాణా వ్యాపారం చేసే ఈ సూపర్ మార్కెట్ల మరో ప్రత్యేకత ఏమంటే.. ఉదయం ఓపెన్ చేసినప్పటి నుంచి రాత్రి మూసేసే వరకు కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి.

ఈ సంస్థ విజయంలో కీలకభూమిక.. ఈ సంస్థ అనుసరించే వ్యూహమేనని చెప్పాలి. తక్కువ లాభానికి ఎక్కువ సరుకులు అమ్ము అనే ఆలోచనతో పాటు.. తాము ఏర్పాటు చేసే సూపర్ మార్కెట్లు మొత్తం తమ సొంతంగానే ఏర్పాటు చేస్తారు.

వీరు నిర్వహించే సూపర్ మార్కెట్లు ఏవీ కూడా.. అద్దెకు స్థలాన్ని తీసుకోవటం ఉండదు. దీంతో.. అద్దె భారం చాలా తక్కువగా ఉండటం ఈ సంస్థ ఎదుగుదలకు కీలకమైందని చెప్పాలి. నాలుగైదేళ్ల క్రితం వరకు కొద్దిమందికే పరిచయం ఉన్న దమానీ.. తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరిస్తూ దూసుకెళుతున్నారు. తాజాగా ఆయన టాప్ 100 ప్రపంచ కుబేరుల స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ జాబితాలో తాజాగా ఆయనకు 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపద 19.2 బిలియన్ డాలర్లుగా తేల్చారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.1.38లక్షల కోట్లుగా నిర్దారించారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టాప్ 100 కుబేరుల్లో మన దేశం నుంచి ఇప్పటికే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. గౌతమ్ అదానీ.. అజీమ్ ప్రేమ్ జీ.. పల్లోంజీ మిస్త్రీ.. శివ నాడార్.. లక్ష్మీ మిత్తల్ ఉన్నారు. తాజాగా దమానీ చోటు దక్కించుకున్నారు.

Tags:    

Similar News