ముస్లింలు నా ఆఫీసుకు రావ‌ద్దు:బీజేపీ ఎమ్మెల్యే

Update: 2018-06-07 11:51 GMT
కొంతకాలంగా త‌మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో అధిష్టానానికి బీజేపీ నేత‌లు త‌లనొప్పులు తెచ్చిపెడుతోన్న సంగ‌తి తెలిసిందే. నిరుద్యోగుల‌పై త్రిపుర సీఎం బిప్ల‌వ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు మొదలుకొని.....నార‌దుడు జ‌ర్న‌లిస్టేన‌ని మ‌రో బీజేపీ నేత నొక్కి వ‌క్కాణించ‌డం వ‌ర‌కూ ఆ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. బిప్ల‌వ్ వ్యాఖ్య‌ల‌పై ఏకంగా ప్ర‌ధాని స్పందించి చుర‌క‌లంటించారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ నేత‌ల తీరు మార‌డం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం వారికి అల‌వాటుగా మారింది. తాజాగా, క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర ఎమ్మెల్యే బ‌స‌వ‌గౌడ పాటిల్....ముస్లింల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుర్ఖాలు వేసుకున్న ముస్లిం మహిళలకు - టోపీలు పెట్టుకొని వ‌చ్చే ముస్లిం పురుషుల‌కు త‌న కార్యాలయం పరిసర ప్రాంతాల‌లోకి కూడా రానివ్వనని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, వారికి ఏ విధ‌మైన సహాయం చేయ‌బోన‌ని య‌త్నాల్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌న నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న య‌త్నాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీ హ‌యాంలో మ‌త అస‌హ‌నం పెరిగిపోయిందంటూ ఓ ప‌క్క ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్న‌ప్ప‌టికీ....బీజేపీ నేత‌ల తీరు మార‌డం లేదు. ముస్లింలు త‌న‌కు ఓటు వేయలేద‌ని - అటువంట‌పుడు వారికి తాను ఎందుకు ప‌నిచేయాలంటూ య‌త్నాల్ ప్ర‌శ్నిస్తున్నారు. ముస్లిం పురుషులు - స్త్రీలు తన కార్యాలయం వైపు క‌న్నెత్తి కూడా చూడకూడదని హుకుం జారీ చేశారు. త‌న‌కు హిందువులు మాత్రమే ఓట్లు వేశారని - తాను గెలిచింది హిందువుల‌ ఓట్ల వ‌ల్లేన‌ని యత్నాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గడ్డం పొడవుగా పెంచుకుని - తల మీద టోపీలు పెట్టుకుని వచ్చేవారిని - బుర‌ఖా ధ‌రించే వారిని తన కార్యాలయంలోకి అనుమతించబోనని తెగేసి చెప్పారు. అంత‌టితో ఆగ‌కుండా - ముస్లింలకు విజ‌య‌పుర కార్పొరేటర్లెవ‌రూ సాయం చేయ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ముస్లింల‌పై బీజేపీ నేత‌లు ఈ త‌ర‌హా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ఇది తొలిసారేమీ కాదు. తన కార్యాలయంలోకి హిందువులను మాత్రమే అనుమ‌తిస్తాన‌ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే గ‌తంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కర్ణాటకకే చెందిన మరో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే యత్నాల్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం నిజంగా శోచ‌నీయం.

కాగా, య‌త్నాల్ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక బాధ్య‌త గ‌ల ప్ర‌జాప్ర‌తినిధి అయిన య‌త్నాల్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు దేశ స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిగిస్తాయ‌ని, ఆ వ‌ర్గం ప్ర‌జ‌ల్లో అభ‌ద్ర‌తా భావాన్ని క‌లిగిస్తాయ‌ని అంటున్నారు. బ‌హిరంగంగా ఒక ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక‌నైనా య‌త్నాల్...బాధ్య‌తాయుతంగా న‌డుచుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. భ‌విష్య‌త్తులో బీజేపీ నేత‌లు  ఈ త‌ర‌హా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు మానుకోకుంటే....రాబోయే ఎన్నికల్లో ప్ర‌జ‌లు బీజేపీకి స‌రైన గుణ‌పాఠం చెబుతార‌ని మండిప‌డుతున్నారు. 
Tags:    

Similar News