ఏపీకి వస్తున్న కేసీయార్ ని ఈ ప్రశ్నలు వేయాల్సిందేనా...?

Update: 2022-12-14 23:30 GMT
కేసీయార్. తిమ్మిని బమ్మిని చేయగలవారు. మాటలతో మంత్రం వేసే నేర్పు ఆయనకు ఉంది. ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చిన బహు మొనగాడు. ఉమ్మడి ఏపీ ఎప్పటికీ చీలదు అని ఆంధ్రా వారు ధీమాగా ఉన్న టైం లో ఏమీ కాకుండా సౌత్ లో అతి పెద్ద రాష్ట్రాన్ని రెండుగా చేసి ఆంధ్రులని  అవాక్కు చేసిన వారు కేసీయార్. రాజకీయాన్ని తనకు ఎలా అనుకూలం చేసుకోవడమో తెలిసిన వారు కాబట్టే మర్రి చెన్నారెడ్డి సాధించలేనిది కేసీయార్ చేసి చూపించారు.

ఇక తెలంగాణా రాష్ట్రం కోసం ఆయన చేసిన ఉద్యమం, ఆ సందర్భంగా అన్న మాటలు అందరికీ ఈ రోజుకీ బాగా గుర్తు ఉన్నాయి. ఆంధ్రులకు బిర్యానీ వండడం రాదు అన్నారు. ఆంధ్రులు మాట్లాడే భాష కంటే అచ్చ తెనుగు తెలంగాణాలో ఉంది అని చెప్పుకున్నారు. తెలంగాణా వారిని తీరని అన్యాయం చేశారు అని పదే పదే ఆంధ్రుల మీద పడి ఆడిపోసుకున్నారు. లంకలో పుట్టిన వారు అంతా రాక్షసులు అయినట్లే ఆంధ్రులు అంతా కూడా అలాంటి వారే అని భారీ డైలాగులు కొట్టారు.

తమ నెత్తి మీద ఉన్నారని, తమ నీరు, నిధులు నియామకాలు అన్నీ దోచుకున్నారు అని ఆంధ్రులను ఎంతలా రెచ్చగొట్టారో చరిత్ర పుటల్లో ఉంది. ఒక విధంగా ఒకే భాష మాట్లాడే వారిని సాటి వారు ఆరు దశాబ్దాలుగా కలసి కాపురం చేసిన వారు అన్న దమ్ములుగా ఉన్న వారు ఇలా విడిపోయే వేళ ఇంతటి అవమానాలు, తిట్లూ శాపనార్ధాలు ఎవరూ ఎప్పుడూ ఎక్కడా తిట్టలేదు. ఆ విధంగా చూస్తే ఆంధ్రులది మౌన రోదన. వారిది దీన వేదన.

ఏపీలోని రాజకీయ నాయకులు తమ వ్యాపార రాజకీయ ఇతర అవసరాల కోసం ఆంధ్రులను ఎన్ని మాటలు అన్నా సరైన తీరున స్పందించలేదు. ఈ రోజు ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా విభజించారు అని చెబుతున్న మేధావులు మహా నాయకులు ఎవరూ కూడా కేసీయార్ ని ఈ రోజుకీ ఆంధ్రులను ఎందుకు ఇలా అన్నారని పల్లెత్తి ప్రశ్నించలేదు సరికదా ఆయన పిలిచారు అంటూ తగుదునమ్మా అని ఆయన వద్దకెళ్ళి మరీ విందాగరిగించి వచ్చారు. అడ్డగోలు విభజనకు బీజేపీని కాంగ్రెస్ ని తప్పుపడుతున్న వారు అసలు సూత్రధారి పాత్రధారి కేసీయార్ ని ఏమీ అనకపోవడం వెనక ఏ రకమైన భయాలు లాభాలూ ఉన్నాయో తెలియదు. కానీ అయిదు కోట్ల ఆంధ్రులు మాత్రం పాపం పున్నెం తెలియకుండానే బలి అయిపోయారు.

కేసీయార్ అండ్ కో మాటల దాడికి తిట్లకు శాపనార్ధాలకు గురి అయిపోయారు. మరో వైపు చూస్తే తెలంగాణాలో రాజకీయం చేద్దామన్నా కూడా ఆంధ్రా మూలాలను వెతికి మరీగొడవ చేసే రాజకీయమే ఈ రోజుకీ సాగుతోంది. అలాగే సెటిలర్స్ ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తున్న వైనం కళ్ళ ముందు ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా వేళ ఆంధ్రాలో సరైన ఆసుపత్రి లేక హైదరాబాద్ వస్తే వారిని సరిహద్దుల వద్ద అంబులెన్సులతో సహా ఉంచేసి ఇబ్బంది పెట్టిన దాష్టికం కూడా ఇంకా పచ్చిగా కళ్ల ముందే ఉంది.

విడిపోయినా అన్నదమ్ములమే, కలసి మెలసి ఉందామని చెప్పిన తెలంగాణా పెద్దలు ఆ తరువాత తొమ్మిదేళ్ళుగా ఏమి చేశారో అందరికీ తెలుసు. ఇపుడు కేసీయార్ జాతీయ పార్టీ అంటూ బీయారెస్ కి కొత్త కామందు అయ్యారు. ఆయనకు ఏపీతో ఆంధ్రులతో అవసరం పడింది. మరి ఏపీ ఓట్లు ఆయనకు ఇపుడు కావాలి. దాంతో ఆంధ్రులను మేము ఎపుడైనా తిట్టామని అని కేసీయార్ గారాల పట్టి కవిత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇంకోవైపు చూస్తే కేసీయార్ కూడా ఏపీకి వచ్చి ఆంధ్రులు గొప్పోళ్ళు అంటూ నన్నయ్య తిక్కన, అన్నమయ్యల వైభవం గురించి చెబుతారు. కానీ ఇదే కేసీయార్ ఎవరీ తెలుగు తల్లి, ఎవరి కోసం ఈ తెలుగు తల్లి అంటూ ఈసడించిన విషయాలు చాలానే ఉన్న సంగతి అందరికీ తెలుసు.

ఇక ఏపీకి కేసీయార్ వస్తే ఆంధ్రులు నిలదీస్తారా. ఉద్యమ కాలంలో అన్న మాటలకు కేసీయార్ నుంచి క్షమాపణలు కోరుతారా. ఏపీ అభివృద్ధికి తెలంగాణా నుంచి ఎటువంటి అడ్లూ పెట్టకుండా సహకరిస్తామని మాట తీసుకుంటారా. ఉమ్మడి రాజధానిగా అంతా కలసి అభివృద్ధి చేసిన హైదరాబాద్ పోయిన తరువాత ఏపీ ఎంతలా చితికిపోయిందో కేసీయార్ కి తెలుసు. మరి ఏపీలో అమరావతి రాజధానికి తన వంతుగా ఏమైనా సాయం చేస్తారా అని అడుగుతారా. అలాగే పోలవరం మీద కేసీయార్ స్టాండ్ ఏంటి అన్నది కూడా అడగాలి కదా. ఏపీలో రాయలసీమ వాసులకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పుల్లలు పెడుతున్న తెలంగాణా ఇక మీదట వాటిని స్టాప్ చేస్తుందని కేసీయార్ నుంచి హామీ తీసుకుంటారా.

అలాగే లక్ష కోట్ల విలువ చేసే ఆంధ్రా ఆస్తులు అన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. వాటికి విలువ కట్టి ఏపీ ఖజానాకు ఆ సొమ్ము జమ చేయమని అడగగలరా. ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ బకాయిలు ఏపీకి చెల్లించాల్సిన తెలంగాణా ప్రభుత్వం వాటిని వెంటనే ఇచ్చి ఏపీ ఆర్ధికాన్ని ఆదుకుంటుందని కూడా కేసీయార్ నోటి వెంట చెప్పించగలరా. ఇవన్నీ కేసీయార్ ని అడగాలి. ఆయనకు ఇపుడు ఏపీ కావాల్సి వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా మీద ఎలా పోరాడుతారు సారూ అని కూడా అడగాలి కదా.

అదే విధంగా ఏపీకి కేంద్రం నుంచి అమలు కావాల్సిన విభజన హామీల విషయంలో ఏ విధంగా పోరాడుతారు అని కూడా ప్రశ్నించాలి కదా. మరి ఆంధ్రులు ఇవన్నీ చేస్తారా. లేక షరా మాములుగా మనకెందుకు అనుకుంటూ ఆగిపోతారా. ఏమో ఈసీ ఆయనకు జాతీయ పార్టీగా అవకాశం ఇచ్చింది. కానీ ఏపీ ఓట్లు కూడితేనే ఆ హోదా దక్కేది. మరి మన అవసరం ఉన్న కేసీయార్ ని ఆంధ్రులు చాలా విషయాల్లో అడిగి తమ డౌట్లు తీర్చుకోవాలి కదా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News