వరుస ఆత్మహత్యలు.. హైదరాబాద్ వైద్యులకు ఏమైంది?

Update: 2020-03-14 08:34 GMT
హైదరాబాద్ మహానగరంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారా? వ్యక్తిగత కారణాలు కావొచ్చు.. ఇంట్లో సమస్యలు కావొచ్చు.. వైవాహిక జీవితంలో ఇష్యూలు కావొచ్చు.. ప్రొఫెషన్ పరంగా ఇబ్బందులు.. ఆర్థిక అంశాలు.. ఇష్యూ ఏదైనా కానీ..ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో వైద్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వైనం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోందని చెప్పాలి. గడిచిన మూడు నెలల వ్యవధిలో వైద్యులుగా వ్యవహరిస్తున్న వారు..ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తుంటే అవాక్కు అవ్వాల్సిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే నగరంలోనూ.. పట్టణంలోనూ లేని రీతిలో హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి పరిస్థితి ఉండటం.. బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి. ఇటీవల దమ్మాయిగూడలో ఆదిత్య ఆసుపత్రి ఎండీ రవీంద్రకుమార్ ఆత్మహత్యను మర్చిపోక ముందే.. తాజాగా సుచిత్రకు దగ్గర్లోని మరో వైద్యుడు బలవనర్మణానికి గురి కావటం సంచలనంగా మారింది.

ప్రేమించిన అమ్మాయిని గుట్టుగా పెళ్లి చేసుకోవటం.. తర్వాత తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవటంతో మనసు వికలమై.. మత్తు ఇంజెక్షన్ తో మరణశాసనాన్ని (?) రాసుకున్నట్లుగా భావిస్తున్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం అనుమానాస్పద మరణంగా రిపోర్టు చేస్తున్నా.. స్థానికులు.. డాక్టర్ సుభాష్ తో పరిచయం ఉన్న వారు చెబుతున్న అంశాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ శివారు అయిన కుత్భుల్లాపూర్ లోని గాయత్రి నగర్ లో సింగయ్య సింగరేణి లో పదవీ విరమణ చేశారు. ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చిన అతడికి ఇద్దరు ఆడపిల్లలు.. ఇద్దరు మగ పిల్లలు. నలుగురిలో చిన్నవాడు సుభాష్. మెడిసిన్ కోర్సును పూర్తి చేసిన అతను సికింద్రాబాద్ యశోదలో కార్డియాలజిస్టుగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గాంధీలో ఈఎన్ టీ వైద్యురాలిగా పని చేస్తున్న నిత్యతో అతడికి పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరు మూడేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు.

తర్వాత సుభాష్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. తమ పెళ్లి విషయం ఇంట్లో వారికి చెప్పి వస్తానని కేరళ వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తమ ఇంట్లో వారు పెళ్లిని ఒప్పుకోవటం లేదని.. ఒప్పించిన తర్వాత వస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. అలా చెప్పిన నిత్య ఎంతకూ తిరిగి రాక పోవటంతో మనోవ్యధకు గురైన అతడు మత్తు ఇంజక్షన్ తీసుకొని చనిపోయినట్లు గా భావిస్తున్నారు. వైద్యుడై ఉండి.. భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటం తో పాటు.. తనను కష్టపడి చదివించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా సంచలనం గా మారింది. కారణం ఏదైనా కానీ.. ఇటీవల నగరానికి చెందిన వైద్యులు ఆత్మహత్యలు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News