విశాఖలో యూఎస్ కాన్సుల్ జనరల్ టూర్... రుషికొండ ప్యాలెస్ ఆప్షన్?

అవును... ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖలో ఒక చోట యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అంటున్నారు.

Update: 2024-11-20 10:56 GMT

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ గురించిన విషయాలు కథలు కథలుగా చర్చకు వస్తోన్న సంగతి తెలిసిందే. దీని నిర్మాణాల కోసం సుమారు రూ.450 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని.. ఇది వృథా ఖర్చు అని కూటమి ప్రభుత్వం మండిపడింది. ఇక ఈ ప్యాలెస్ లోపల పెట్టిన ఖర్చు వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... బాత్ రూం లలోని ఒక్కో బాత్ టబ్ కు పెట్టిన ఖర్చు రూ.12.38 లక్షలు కాగా.. వాష్ బేసిన్ కి పెట్టిన ఖర్చు రూ.2.61 లక్షలని కథనాలొచ్చాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో యూఎస్ వీసా సెంటర్ గా ఇది ఎలా ఉంటుందా అని!

అవును... ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖలో ఒక చోట యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ అయితే... అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల యువతకు ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే... విశాఖలో యూఎస్ వీసా అప్లికేషన్ ఏర్పాటు చేస్తే అందుకు రుషికొండ ప్యాలెస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్న రుషికొండ భవనంలో కాన్సులేట్ ఏర్పాటుకు అనువైన సకల సౌకర్యాలు ఉన్నట్లేనని అంటున్నారు. ఇది కచ్చితంగా మంచి ఆలోచనే అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క... హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే.. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా తన పీఆర్వో అలెగ్జాండర్ మె లారెన్ తో కలిసి విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె... అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలి స్థానంలో భారత్ నిలవగా.. అందులో తెలుగువారు అత్యధికం అని తెలిపారు.

2023-24 నాటికి అమెరికాలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా.. అందులో 56% ఏపీ తెలంగాణకు చెందినవారే అని తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం ఉన్నారని వెల్లడించారు. ఈ ఫ్లో కంటిన్యూ చేస్తూ అన్నట్లుగా... ఈ ఏడాది హైదరాబాద్ లో సుమారు 47 వేలకు పైగా స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు.

కాగా... ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ - 2024ను భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల ఢిల్లీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న 11.26 లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ్లు 29శాతం అని తెలిపారు. అయితే... వీరిలో తెలుగు విద్యార్థులే అధికం అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యలోనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో యూఎస్ కాన్సుల్ ఇప్పటికే ఉండగా.. ఏపీలో విశాఖలో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రుషికొండ భవనాల పై నెట్టింట చర్చ మొదలైంది.

Tags:    

Similar News