కౌరవ సభేకానీ.. గౌరవ సభ కాదు.. ఈ మాటలకు మూడేళ్లు..!
''ఇది కౌరవ సభే కానీ.. గౌరవ సభకాదు. ఇలాంటి సభలో నేను ఉండలేను. ప్రజల మధ్యకు వెళ్తా.
''ఇది కౌరవ సభే కానీ.. గౌరవ సభకాదు. ఇలాంటి సభలో నేను ఉండలేను. ప్రజల మధ్యకు వెళ్తా. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతా. నాకు జరిగిన అవమానాన్ని.. ప్రజలు నిండు మనసుతో అర్ధం చేసుకోవాలని కోరుతున్నా. ఆశీర్వదించాలని కోరుతున్నా. మీకు నమస్కారం.. మీ అందరికీ నమస్కారం``- 2021, నవంబరు 19న అంటే.. నేటికి ఖచ్చితంగా మూడేళ్ల కిందట అప్పటి విపక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఏపీ అసెంబ్లీ నిండు సభలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరమీదకి వచ్చాయి. గతాన్ని గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. నిండు సభలో చంద్రబాబు కుటుంబాన్ని అవమానించిన ఘటనను గుర్తు చేస్తూ.. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తుండడం గమనార్హం. ఇదేసమయంలో చంద్రబాబు వెనుకనే అనుసరించిన అప్పటి నాయకుడు, ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. `మీ పతనం స్టార్ట్ అయింది. ఈ రోజే మీ పతనం స్టార్ అయింది`` అంటూ ఆగ్రహంవెళ్లిపోయిన దృశ్యాలు కూడా కళ్ల ముందు తారాడుతున్నాయి.
వైసీపీ హయాంలో చంద్రబాబుకు సభలో జరిగిన అవమానం.. రాష్ట్ర వ్యాప్తంగా కదిలించింది. సభ నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. మీడియా ముందు కన్నీటి పర్యంత మయ్యారు. తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు వివరించారు. కట్ చేస్తే.. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నదృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా వ్యంగ్యాస్త్రాలుగా అనేక రూపాల్లో ప్రసారం చేసింది అయితే.. ఇది తమకు మేలు చేస్తుందని వైసీపీ భావించినా.. అవే ప్రజల సెంటిమెంటు ను రెచ్చగొట్టి చంద్రబాబుకు విజయాన్ని అందించాయి.
ఈ పరిస్థితిని జగన్ ఊహించి ఉండకపోవచ్చు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అని చెప్పడానికి ప్రజలు తమను అవమానించినా సహిస్తారని, కానీ, తాము ఆరాధించే నాయకులను అవమానిస్తే మాత్రం సహించరని చెప్పడానికి కూడా ఈ ఘటన ప్రధాన నిదర్శనంగా మారుతుంది. ప్రస్తుతం వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు హల్చల్ చేస్తున్న వీడియో.. వైసీపీకి గుణపాఠం నేర్పాల్పిన అవసరం ఉందన్నది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.